రాజాసింగ్ పై బీజేపీ కఠిన నిర్ణయం?

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.;

Update: 2025-04-08 11:31 GMT
BJP High Command Take Action Against Raja Singh

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా రాజాసింగ్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో, అసలు రాజాసింగ్ వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలపై హైకమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

పార్టీ అంతర్గత విషయాలపై, ముఖ్యంగా పార్టీ నిర్ణయాలపై రాజాసింగ్ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంపై హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నుంచి పూర్తి నివేదికను తెప్పించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజాసింగ్ గత కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు, చోటుచేసుకుంటున్న పరిణామాలపై సమగ్ర నివేదికను రాష్ట్ర నేతలు హైకమాండ్‌కు పంపినట్లు తెలుస్తోంది.

పార్టీలో ఉన్న గ్రూపులు, కొందరు నేతలు ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తే వారితో రహస్యంగా సమావేశమవుతున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావును ప్రకటించడంపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో మరింత వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారని పలువురు నేతలు భావిస్తున్నారు. రాజాసింగ్ వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతోందని కొందరు నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

దీంతో, పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర నేతలు రాజాసింగ్‌పై నివేదికను పంపారు. ఈ నివేదిక ఆధారంగా హైకమాండ్ త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవిని ఆశించారు. అయితే, పార్టీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించడంతో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి రాజాసింగ్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌పై బీజేపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News