బీజేపీతో వైసీపీకి తేడా కొట్టింది అక్కడే ?

ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటి అన్నింటితోనూ కేంద్రంలోని కమలం పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా దోస్తీ చేస్తూనే ఉంది.

Update: 2024-10-15 12:30 GMT

ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటి అన్నింటితోనూ కేంద్రంలోని కమలం పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా దోస్తీ చేస్తూనే ఉంది. దాని వల్ల ఆయా రాజకీయ పార్టీలకు ఎంతో లాభం వచ్చిందో కానీ బీజేపీ మాత్రం జాతీయ స్థాయిలో బాగానే లబ్ది పొందింది. ఉదాహరణకు వైసీపీని 2019 నుంది 2024 మధ్య స్నేహం పేరుతో బీజేపీ తన బిల్లులు అన్నీ నెగ్గించుకుంది.

వైసీపీ సైతం అవుట్ రేట్ గా బీజేపీ పెట్టిన ప్రతీ బిల్లుకూ మద్దతు తెలుపుతూ వచ్చింది. ఆ విధంగా చూస్తే కొన్ని బిల్లుల విషయంలో కానీ బీజేపీ అంటే పడని మైనారిటీ బడుగు వర్గాలలో కానీ వైసీపీ కోరి చెడ్డను మూటకట్టుంది. దాని ఫలితాన్ని కూడా వైసీపీ 2024 ఎన్నికల్లో అనుభవించింది.

బీజేపీకి అయితే పోయింది ఏమీ లేదు, టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని ఎంచక్కా మళ్ళీ ఏపీలో సీట్లూ ఓట్లతో పాటు ఆయా పార్టీల మద్దతుని కూడా దక్కించుకుని కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చింది. ఒక్కసారి వెనక్కి వెళ్తే 2014 నుంచి 2019 మధ్యలో టీడీపీతో చెలిమి చేసి ఆ పార్టీని అలాగే బీజేపీ ఉపయోగించుకుంది అన్న ప్రచారం ఉంది. సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీ కటీఫ్ చెప్పింది. అయితే బీజేపీ వైసీపీని చేరదీసి కాగల కార్యాన్ని నెరవేర్చుకుంది. అపుడు టీడీపీ దారుణంగా ఓటమి పాలు అయి ఎటూ చెందకుండా పోయింది.

ఆనాడు బీజేపీతో దోస్తీకి కటీఫ్ చెప్పడం వల్ల జరిగిన నష్టమేంటో తెలుసుకుని తెలుగుదేశం పార్టీ మళ్లీ ఆ బంధాన్ని పునరుద్ధరించింది. అయితే వైసీపీకి ఆ చాన్స్ ఉందా అంటే ఇప్పటికి అయితే ఎవరూ జవాబు చెప్పలేరు. ఇక టీడీపీ తానుగా కావాలనే బీజేపీతో విడిపోయింది. అది 2018లో జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని అలా చక్రం తిప్పవచ్చు అన్న అతి పెద్ద వ్యూహంతో టీడీపీ వేసిన ఎత్తుగడలు చివరికి చిత్తు అయ్యాయి. బీజేపీ టీడీపీని వీడలేదు కాబట్టి సులువుగానే 2024 ఎన్నికల్లో ఆ పార్టీలు కలసిపోయాయి.

ఇక వైసీపీ విషయం అలా కాదు కమల బంధాన్ని పరోక్షంగా అయినా తాను వీడకూడదు అని అనుకుంది. అసలు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోదు అని కూడా చాలా గుడ్డిగా అంచనా వేసుకుంది. చంద్రబాబు ఏకంగా బీజేపీ పెద్దల మీద చేసిన కామెంట్స్ తో వారు ఎప్పటికీ కలవరని కూడా లెక్క వేసుకుంది. కానీ ఇది రాజకీయం. బీజేపీ ఫక్తు రాజకీయ పార్టీ.

అందుకే కలసి వచ్చిన కాలానికి ఏమి చేస్తే అధికారం దక్కుతుందో తెలుసు కాబట్టి అలాగే చేసింది. ఇక్కడ వైసీపీ మాత్రం బీజేపీని నమ్మి ఒంటరి అయిపోయింది. బీజేపీ అండ దొరకడం వల్లనే టీడీపీ 2024 ఎన్నికల్లో గెలిచింది అని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. దానికి తోడు ఈవీఎంలను మేనేజ్ చేశారు అన్న ఆరోపణలను కూడా బాగా నమ్ముతోంది.

తాము కచ్చితంగా గెలిచేవారమే కానీ బీజేపీ కేంద్రంలో ఉండడం వల్ల ఆ పార్టీ ఇచ్చిన మద్దతుతోనే ఏపీలో టీడీపీ గెలిచిందని కూడా విశ్వసిస్తోంది. ఇది చాలా వరకూ కరెక్టే అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఈసారి టీడీపీకి కలసి వచ్చిన అంశాలు ఏవీ వైసీపీకి కలసి రాలేదు. పేరుకు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే కధ సాగింది.

పూర్తిగా చేతులు కట్టేసినట్లుగా అయిపోయింది. దాంతో మూడు పార్టీలు మూకుమ్మడిగా దాడి చేయడంతో వైసీపీ చేతులెత్తేయాల్సి వచ్చింది. ఏపీలో వైసీపీ గెలిచినా బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పి ఉంచిందని కూడా ప్రచారం సాగింది. అందువల్ల బీజేపీని న్యూట్రల్ గా ఉండిపోమని పొత్తులు వద్దని కూడా చెప్పింది అని ప్రచారం అప్పట్లో సాగింది.

కానీ ఏపీలో వైసీపీ గ్రాఫ్ బాగా పడిపోవడం తో పాటు ఆ పార్టీని నమ్ముకుంటే తాము కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించడం వల్లనే టీడీపీ వైపు మళ్ళారు అని అంటున్నారు. బీజేపీ పొత్తులో కలవకపోయినా జనసేన టీడీపీ కలిస్తే చాలు ఏపీలో అధికారం వారిదే అన్న విశ్లేషణలు ఉండడంతోనే బీజేపీ కూడా చేతులు కలపాల్సి వచ్చిందని అంటున్నారు.

సరే బీజేపీ చేతులు కలిపినా ఓకే అనుకున్నా పూర్తి స్థాయిలో కూటమికి హెల్ప్ చేసిందని దాని వల్లనే దారుణమైన ఓటమి లభించిందని ఈవీఎంల పాత్ర కూడా అనుమానంగా ఉందని వైసీపీ నుంచి వస్తున్న మాట. ఇవన్నీ కలసే వైసీపీ బీజేపీ మీద సమయం సందర్భం దొరికినపుడల్లా పరోక్ష విమర్శలు చేస్తోందని అంటున్నారు.

ఎక్కడో హర్యానాలో బీజేపీ గెలిచి కాంగ్రెస్ ఓడితే ఈవీఎంల తో ఎన్నికలు వద్దు అని జగన్ ట్వీట్ చేయడం కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ విషయంలో పూర్తిగా అన్నీ తెలిసి వచ్చాయని అందుకే వైసీపీ పెద్దలు కమలానికి దూరం అని అంటున్నారని ప్రచారం సాగుతోంది. మరి ఈ రాజకీయం ఎన్నాళ్ళు సాగుతుంది, శాశ్వతంగా బీజేపీకి దూరం జరుగుతారా లేక ఏమైనా మార్పులు వస్తాయా అంటే వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News