టీడీపీ+జనసేనతో బీజేపీ పొత్తు.. మోడీ కోర్టులో బంతి!

తమ పొత్తుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు కూడా ఉంటాయని తాను నమ్ముతున్నానన్నారు.

Update: 2024-01-05 08:28 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ కూటమిలోకి బీజేపీ కూడా రావాలని ఈ రెండు పార్టీలు ఆశిస్తున్నాయి. అయితే టీడీపీ ఎక్కడా బయటపడటం లేదు. కానీ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ మాత్రం బీజేపీ కూడా తమతో కలిసి రావాలని చెబుతున్నారు. తమ పొత్తుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు కూడా ఉంటాయని తాను నమ్ముతున్నానన్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీల మధ్య ఆంధ్రప్రదేశ్‌ లో పొత్తు ఉంది.

టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేయాలని ఇప్పటికే పవన్‌ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలకు నివేదించి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నాయకత్వం, కోర్‌ కమిటీ సభ్యులు విజయవాడలో రెండు రోజులపాటు పొత్తుల అంశంపై చర్చించారు. ఇందులో ఒకరిద్దరు తప్ప అంతా టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలనే సూచించారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ, జనసేనలతో కలిసి నడవాలని బీజేపీ రాష్ట్ర నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం పెద్దలకు కూడా తెలియజేశారు. తాజాగా విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీ నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరి అభిప్రాయాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సేకరించారు. ఈ అభిప్రాయాలను పురందేశ్వరి సీల్డ్‌ కవర్‌ ద్వారా పార్టీ పెద్దలకు నివేదించనున్నారు.

తాజాగా విజయవాడలో జరిగిన సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలు చర్చించారు. ఇందులో జాతీయ నాయకుడు శివప్రకాష్, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సహా 40 మంది నేతలు పాల్గొన్నారు. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. టీడీపీ, జనసేనలతో కలిసి నడిస్తే లాభపడతామని పలువురు నేతలు సూచించినట్టు తెలుస్తోంది.

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమంటున్నారు. పొత్తు గురించి పవన్‌ కళ్యాణ్‌ చెబితే సరిపోదని.. పొత్తు కావాలనుకుంటున్నవారు (చంద్రబాబు) కూడా చెప్పాలన్నారు. పొత్తులపై రాష్ట్ర స్థాయిలో తాము నిర్ణయం తీసుకోలేమన్నారు. పొత్తు కోరేవారు ముందుకొస్తేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మరోవైపు జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఆ పార్టీ జాతీయ నేత శివప్రకాష్‌ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పొత్తుల గురించే నాదెండ్ల మాట్లాడారని అంటున్నారు.

రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మంది బీజేపీ నేతలతో పొత్తుకే సై అంటుండటంతో ఈ బాల్‌ మోడీ కోర్టులోకి చేరింది. అందరి అభిప్రాయాలను సీల్డ్‌ కవర్‌ లో అందిస్తామని పురందేశ్వరి తెలియజేయడంతో పొత్తులపై ప్రధాని నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు జనసేనతోనే కలిసి ఉన్న బీజేపీ ఇప్పుడు టీడీపీతో పొత్తుకు కలిసి వస్తుందో, రాదో మోడీ తేల్చాల్సి ఉంది.

Tags:    

Similar News