కర్ణాటకంలో కమలం బిజీ...ఇమేజ్ ని పందెం కట్టి !
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ప్రాసిక్యూషన్ అంటూ బీజేపీ పరోక్షంగా ఆడిస్తున్న ఈ ఆటలో పావు గవర్నర్ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
బీజేపీ అంటే తేడా పార్టీ అంటారు. ఆ తేడా కి అర్ధం ఏంటి అంటే మిగిలిన పార్టీల కంటే సిద్ధాంతపరంగా తేడా అని. నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి నీతిగా నిజాయితీగా ఉండే పార్టీ అని. అయితే ఇదంతా ఒకప్పటి మాట. నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో బీజేపీ ఇపుడు నయా పాలిటిక్స్ కి తెర తీసింది.
తాము అధికారంలో లేని చోట రాజకీయంగా చేయాల్సినవి అన్నీ చేస్తూ పోతోంది. 2018 లో కర్నాటకం స్టార్ట్ చేసి చాలా మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత మధ్యప్రదేశ్ లో అదే గేం ఆడింది. మహారాష్ట్రలో ఒకే ఫిలాసఫీ తో నడిచే చిరకాల మిత్రపక్షం అయిన శివసేనను సైతం రెండుగా చీల్చి మరీ అక్కడ అధికార పంట పండించుకుంది.
జార్ఖండ్ లో సీఎం గా ఉన్న హేమంత్ సోరెన్ కి జైలు దారి చూపించి అక్కడ పాగా వేద్దామని ప్రయత్నం చేసింది అని కూడా విమర్శలు ఉన్నాయి. ఇపుడు తిప్పి తిప్పి మళ్ళీ కర్నాటకం స్టార్ట్ చేసింది అనుకుంటున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద ప్రాసిక్యూషన్ అంటూ బీజేపీ పరోక్షంగా ఆడిస్తున్న ఈ ఆటలో పావు గవర్నర్ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
ఏమీ లేని చోట ఏదో అయినట్లుగా భ్రాంతికి కలిగించి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి అందులో రాజకీయ లాభం చూసుకునే కమలం తీరు పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఏణ్ణర్థం క్రితం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపారు. కాంగ్రెస్ ని తెచ్చి పెట్టారు.
అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జేడీయూతో పొత్తు పెట్టుకుని బీజేపీ మళ్ళీ ఎక్కువ ఎంపీ సీట్లను తెచ్చుకోవడం ద్వారా తన పొలిటికల్ గ్రాఫ్ ని పెంచుకుంది. కాంగ్రెస్ సర్కార్ కొనసాగితే ఆ ప్రభుత్వం పట్ల జనాలకు విసుగు పుడితే బీజేపీకి చాన్స్ ఉండొచ్చు. అలా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు అయిన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎందుకు తాపత్రయం అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు.
ఆ రాజకీయ అలజడిలో చలి కాచుకోవాలని ఎందుకు ఆరాటం అని కూడా నిలదీస్తున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా సిద్ధరామయ్య వర్సెస్ బీజేపీగా కర్ణాటక రాజకీయం సాగుతోంది. గవర్నర్ చేసింది ఒప్పు అని బీజేపీ నేతలు సమర్ధించుకుంటూంటే కాదు గవర్నర్ బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా ఆడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ కర్ణాటకానికి క్లైమాక్స్ ఏంటి ఎలా కధ కంచికి చేరుతుంది ఎవరికి లాభం ఎవరికి బూమరాంగ్ అన్నది ఇపుడే తెలియదు కానీ బీజేపీ మాత్రం కర్నాటకంలో చేయి పెట్టడం పట్ల విమర్శలు అయితే వస్తున్నాయని అంటున్నారు.
ఈ మొత్తం రాజకీయంలో బీజేపీ ఇమేజ్ సైతం దెబ్బతింటోందని అనే వారూ ఉన్నారు. అంతలా తన అస్థిత్వాన్నే ఫణంగా పెట్టి పందెం కట్టి రాజకీయ జూదం ఆడాలా అన్న చర్చ కూడా పార్టీ లోపలా బయటా ఉంది మరి.