మోడీ వల్ల బీజేపీ గెలవడంలేదు... పీకే సంచలన కామెంట్స్..!

బీజేపీని నాలుగు వైపులా పదునైన ఆయుధాలు ఉన్నాయని వీటిని ముందు పెట్టి బీజేపీ చేస్తున్న యుద్ధంలో విపక్షాలు విఫలం అవుతున్నాయని అన్నారు.

Update: 2023-11-03 07:09 GMT

బీజేపీ గెలుపు నరేంద్ర మోడీ ఇమేజ్ తోనే అని అంతా అంటూంటారు. అందుకే మోడీ మీద నేరుగా విమర్శలు చేస్తారు. విపక్షాలు అయితే మోడీనే గట్టిగా టార్గెట్ చేస్తారు. అయితే ఒకనాడు బీజేపీకి మోడీకి కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే మాత్రం అది పూర్తిగా తప్పు అంటున్నారు. బీజేపీ గెలుపు వెనక మోడీ అమిత్ షా ఆరెస్సెస్ ఉన్నారనుకుంటే పొరపాటు అని అన్నారు.

బీజేపీ గెలుపునకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీకి అవే అసలైన బలం, అస్థిత్వం కూడా అని ఆయన అంటున్నారు. బీజేపీ విజయం వెనక ముందుగా చెప్పుకోవాల్సింది హిందూత్వం అని ఆయన అన్నారు. హిందూత్వ అన్నది బీజేపీ ఆయువు పట్టు అసలైన ఫిలాసఫీ అని ఆయన అభివర్ణించారు.

భారత్ అన్నది హిందూ జనాభా అధికంగా కలిగిన దేశం. దాంతో బీజేపీ హిందూత్వ కార్డు బాగా వర్కౌట్ అవుతోంది అన్నది. ప్రశాంత్ కిశోర్ మార్క్ విశ్లేషణగా ఉంది. ఇక రెండవది జాతీయ వాదం. ఇది మాత్రం నరేంద్ర మోడీ వచ్చాక ఇంకా ఇనుమడింపచేశారు అని ఆయన అంటున్నారు. ప్రపంచంలో భారత్ ని చాలా ఎత్తుకు తీసుకుని వెళ్తున్నామని బీజేపీ మోడీ చెప్పే విషయాలు జనాలకు చేరుతున్నాయని అన్నారు.

భారత్ ని విశ్వగురుగా చెప్పడం ప్రపంచ దేశాలు భారత్ అంటే ఎక్కువ గౌరవాభిమానాలను చూపిస్తున్నాయని కూడా పేర్కొనడం ద్వారా మోడీ బలమైన జాతీయవాదాని దేశంలో ప్రతీ పౌరుడిలో కలిగేలా చూశారు అని ఆయన అంటున్నారు. ఇక మూడవది బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ పధకాన్ని ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం అయింది.

కేంద్రం నుంచి లబ్దిదారునికి సొమ్ము అలా డైరెక్ట్ గా చేరడం వల్ల కూడా అవినీతి తగ్గింది. ప్రజలకు న్యాయం జరుగుతోంది. ఇది బీజేపీ విజయానికి మూడవ కారణంగా చెబుతున్నారు. ఇక నాలుగవది బీజేపీ మొదటి నుంచి సంస్థాగతంగా బలమైన పునాది కలిగిన పార్టీ. అలాగే బీజేపీ అనేకసార్లు ఎన్నికల్లో గెలవడం ద్వారా ఆర్ధికంగా పరిపుష్టి అయింది. అలా ఆర్ధికంగా సంస్థాగతంగా బీజేపీ ఎవరూ ఢీ కొట్టలేనంతగా నిలిచి ఉంది.

ఇలా ఈ నాలుగు కారణాలే బీజేపీని ఎన్నికల్లో గెలిపించే సాధనాలు అని ప్రశాంత్ కిశోర్ అంటున్నారు. ఇక మోడీ అమిత్ షాల ప్రచారం ఆరెస్సెస్ వ్యూహాలు బీజేపీకి అదనపు బలాలుగా ఉంటున్నాయి. దాంతో బీజేపీ ఏ ఎన్నిక అయినా ఇదే తరహా వ్యూహంతో ముందుకు పోతోంది అని ఆయన చెబుతున్నారు.

బీజేపీని ఓడించాలి అని ప్రతిపక్షాలు అనుకుంటే సరిపోదని మూలాల్లోకి వెళ్ళి చూడాలని ప్రశాంత్ కిశోర్ అంటున్నారు. బీజేపీని నాలుగు వైపులా పదునైన ఆయుధాలు ఉన్నాయని వీటిని ముందు పెట్టి బీజేపీ చేస్తున్న యుద్ధంలో విపక్షాలు విఫలం అవుతున్నాయని అన్నారు. అందువల్ల రొటీన్ గా యుద్ధంలోకి వెళ్తే బీజేపీని ఎవరూ ఓడించలేరు అన్నది పీకే మార్క్ విశ్లేషణ.

బీజేపీని ఓడించాలంటే నాలుగు బలమైన కారణాలలో మూడింటిని కనుక బ్రేక్ చేసినా లేక వాటి నుంచి జనాల దృష్టిని మళ్ళించినా అపుడు విపక్షాలు గెలిచే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నారు. అంటే హిందూత్వ జాతీయ వాదం వంటి వాటి మీద విపక్షాలు తమదైన విరుగుడు వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని పీకే నొక్కి చెబుతున్నారన్న మాట.

ఇక కేంద్రం ఇచ్చే పధకాలు నేరుగా జనాలకు లబ్ది కల్గించే విషయంలో ఆల్టరేషన్ వెతుక్కోవాల్సి ఉంది అంటున్నారు. చివరిగా బీజేపీ ఆర్ధిక సంస్థాగత బలాలను దెబ్బతీయాలంటే మాత్రం కచ్చితంగా విపక్షాలు ఏకత్రాటి మీదకు రావడం ద్వారా పరస్పర సహకారంతో తమ బలాన్ని పెంచుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు.

ఇవన్నీ ఇండియా కూటమి వల్ల జరిగేనా అన్నదే ఇక్కడ ప్రశ్న. బీజేపీని ఓడించడం అంటే మోడీని విమర్శిస్తూ కూర్చోవడం కాదని పీకే ఇంతలా వివరణగా చెప్పి విపక్షాలకు భారీ సాయమే చేసారు. దాని నుంచి అవి పాఠాలు ఎంతవరకూ నేర్చుకుంటాయన్న దాని మీదనే 2024 ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News