కవిత అరెస్ట్ : బీజేపీ చాణక్య వ్యూహం వెనక...?
అనూహ్యమా లేక ఊహించారా అంటే తెలియదు కానీ బీఆర్ఎస్ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది
అనూహ్యమా లేక ఊహించారా అంటే తెలియదు కానీ బీఆర్ఎస్ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆమెను ఈ రాత్రికి ఢిల్లీ తరలిస్తారు అని అంటున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు అని అంటున్నారు. ఈ అరెస్ట్ అక్రమం అని బీఆర్ఎస్ శ్రేణులు అంతా భగ్గుమంటున్న వేళ ఈడీ కీలకమైన టైం లో కవితను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించబోతోంది.
ఇదిలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ కి ఒక్క రోజు ముందు జరిగిన ఈ అరెస్ట్ రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఎందుకు ఈ పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్నది చర్చకు దారి తీస్తోంది. టైం టైమింగ్ వెనక వ్యూహం ఏంటి అన్నది లోతుగా విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ ని బీజేపీని ముడిపెట్టి 2023 చివరలో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది
ఆ రెండు పార్టీలు ఒక్కటే అని జనాలను నమ్మించగలిగింది. దాంతో ఏకంగా పాతిక పై దాటి రావాల్సిన బీజేపీ సీట్లు ఓట్లూ కూడా దారుణంగా పడిపోయాయి. ఇపుడు చూస్తే కేంద్రంలో మూడవ సారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఈ పరిస్థితులలో మరోసారి కాంగ్రెస్ నుంచి అవే ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ తో పొత్తు అని ఆ మధ్య దాకా అన్నారు కానీ అవి సాగలేదు.
ఇపుడు కూడా ఆ రెండు పార్టీలు ఒక్కటే అని వేరే విధంగా ప్రచారం స్టార్ట్ చేస్తారు. దాంతో ఆ చాన్స్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశారు అని అంటున్నారు. ఒక విధంగా రాజకీయంగా లాభం బీజేపీకి చేకూరుతుందనే ఆ అరెస్ట్ అంటున్నారు. ఒక వైపు ఈ కేసు విషయంలో కవిత న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ ఇపుడు అరెస్ట్ చేశరు. దాంతో బీజేపీ తెలంగాణాలో చాణక్య వ్యూహం ఇది అని అంటున్నారు
ఇక ఇంకో వైపు చూస్తే అరెస్ట్ ఎవరిని ఎపుడు ఎలా చేసినా అది రాజకీయంగా మేలు చేసేదిగా ఉంటుందని తలపండిన రాజకీయ నేత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికి ఎన్నో సార్లు కుండబద్ధలు కొట్టి చెబుతున్న మాట. అరెస్టులు అరదండాలు ఎపుడూ రాజకీయ నేతల మెడలో దండలే అని కూడా అంటూంటారు.
మరి కుమార్తె అరెస్ట్ అన్నది కేసీఆర్ ని ఉగ్రమూర్తిగా చేస్తుందా అన్నది మరో చర్చ. కేసీఆర్ కి ఎమోషనల్ అంశం ఏదీ లేకుండా పోయింది. ఆయన మూడు నెలలుగా పెద్దగా ఫోకస్ కావడం లేదు. ఇపుడు ఆయన బీజేపీని ఎదిరించే వీరుడుగా జనంలోకి రావచ్చు అని అంటున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు అని ఆయన తీవ్రమైన ఆరోపణలతో జనంలోకి వెళ్లవచ్చు.
ఒక విధంగా కార్నర్ అయిన బీఆర్ఎస్ కి ఈ అరెస్ట్ వల్ల అగ్రెసివ్ మూడ్ లోకి వచ్చే చాన్స్ ఉందా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే బీజేపీ బీఆర్ఎస్ కలసి ఎన్నికల వేళ సానుభూతి కోసం ఈ విధంగా చేశారు అన్నది కాంగ్రెస్ వైపు నుంచి కూడా విమర్శలు ఉండే చాన్స్ ఉంది. ఏది ఏమైనా ఒక విషయం స్పష్టం బీఆర్ ఎస్ స్పేస్ లోకి బీజేపీ రావాలని చూస్తోంది. దానికి ఇదే సరైన సమయం అని కవిత అరెస్ట్ జరిగింది అంటున్నారు. అయితే ఇది బీజేపీ వ్యూహాన్ని సక్సెస్ ఫుల్ గా నిలబెడుతుందా లేదా అన్నది రానున్న రోజులలో చూడాల్సి ఉంది.