బీజేపీ కీలక నిర్ణయం

తొందరలోనే జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణా బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకున్నది.

Update: 2024-02-09 06:19 GMT

తొందరలోనే జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణా బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే ఈనెలాఖరులోగా మొత్తం 17 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించేయాలని. పార్లమెంటు ఎన్నికల నోటిపికేషన్ వచ్చేలోగానే అభ్యర్ధులను ఫైనల్ చేయాలని ఆశావహుల నుండి కీలకమైన నేతలపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఇదే విషయమై సంఘ్ పరివార్ నేతృత్వంలో బీజేపీ కీలక నేతలు సమావేశం జరిగిందని సమాచారం. ఆ సమావేశంలో సంఘ్ పరివార్ ముఖ్యులు బీజేపీ సీనియర్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారట.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్న వాతావరణాన్ని నేతలే చెడగొట్టారంటు సంఘ్ ప్రముఖులు చివాట్లు పెట్టారట. సీనియర్ నేతల మధ్య సమన్వయం లేకపోవటం, ఆధిపత్య గొడవలు పెరిగిపోవటం లాంటి అనేక కారణాలతోనే పార్టీ విజయావకాశాలు చెడిపోయాయని మండిపోయారట. సంఘ్ ప్రముఖుల ఆగ్రహం ముందు బీజేపీ సీనియర్లు ఏమీ సమాధానం చెప్పలేకపోయినట్లు పార్టీవర్గాల టాక్. తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో అయినా అత్యధిక సీట్లను గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధంచేయాలని ఆదేశించారట.

అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటికే మొదలైన ప్రక్రియను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంఘ్ ప్రముఖులకు వివరించారట. ఆశావహుల నుండి దరఖాస్తులను తీసుకోవటం, వడబోత వ్యవహారాలను చెప్పారట. షార్ట్ లిస్టు చేసిన దరఖాస్తుల జాబితాను ఢిల్లీకి తీసుకెళ్ళి పార్టీ పెద్దలతో చర్చించబోతున్నట్లు చెప్పారట. వచ్చిన దరఖాస్తుల్లో నుండి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను పోటీచేసేందుకు అర్హతలున్న ముగ్గురు నేతల పేర్లతో జాబితాను రెడీచేసినట్లు కిషన్ వివరించినట్లు సమాచారం. తెలంగాణా పర్యటనలో అమిత్ షా, జేపీ నడ్డాలు నేతల మధ్య సమన్వయం అవసరమని చెప్పినా, వివాదాలను పక్కనపెట్టమని చెప్పినా నేతలు ఎవరు పట్టించుకోలేదని సంఘ్ ప్రముఖులు సమావేశంలో మండిపోయినట్లు తెలిసింది.

కీలకమైన సమావేశంలో ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రముఖులు ముకుంద్, అరుణ్ కుమార్, బీజేపీ నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ పాల్గొన్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మరి సంఘ్ ప్రముఖలు తీసుకున్న క్లాసు ప్రభావం పనిచేస్తుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News