బీజేపీకి కొత్త అధ్యక్షుడు అక్కడ నుంచే ?

2020 నుంచి నాలుగేళ్ల పాటు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జేపీ నడ్డా తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చేరారు

Update: 2024-06-10 03:50 GMT

భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు అవసరం పడింది. 2020 నుంచి నాలుగేళ్ల పాటు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జేపీ నడ్డా తాజాగా కేంద్ర మంత్రివర్గంలో చేరారు. దాంతో బీజేపీ కొత్త ప్రెసిడెంట్ ఎవరూ అన్న చర్చ వస్తోంది.

అసలే కేంద్రంలో బీజేపీకి పూర్తి బలం లేదు. మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్లు కొరత ఉంది. దాంతో టీడీపీ జేడీయూల మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం నడపాల్సి ఉంది. ఈ క్లిష్ట పరిస్థితులలో బీజేపీని మిత్రులతో కలుపుకుంటూ ఎక్కడా పొరపొచ్చాలు లేకుండా ఎన్డీయే సర్కార్ నడపాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షుడి పైన ఉంది.

ఒక విధంగా చెప్పాలీ అంటే బీజేపీ నూతన అధ్యక్షుడికి ఈసారి పెను సవాల్ ఎదురు కాబోతోంది అని అంటున్నారు. మిత్ర పక్షలతో సమన్వయం చేసుకుంటూ పోవాలి. అయిదేళ్ల పాటు పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానించి నడపడం ఆషామాషీ వ్యవహారం అయితే కాదు.

అయితే బీజేపీ వరసగా రెండు సార్లు పూర్తి మెజారిటీతో గెలిచి ఈసారి చతికిలపడడం పట్ల పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. 2019లో 304 సీట్లు దక్కాయి. ఈసారి 240 మాత్రమే బీజేపీకి వచ్చాయి.అంటే ఏకంగా 64 సీట్లు కోత పడ్డాయి. దేశానికి గుండె కాయ లాంటి యూపీలో 80 ఎంపీ సీట్లు ఉంటే బీజేపీకి దక్కినవి 32 మాత్రమే. దాంతో యూపీలో మరో మూడేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సి ఉంది.

అలాగే ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం అధికారంలో బీజేపీ మిత్రపక్షాలు ఉన్నాయి. కానీ పార్లమెంట్ లో ఈ పార్టీలకు దెబ్బ తగిలింది. శివసేన ఎన్సీపీలను చీల్చిన ఫలితాన్ని జనాలు బీజేపీకి ఓట్ల ఆగ్రహం రూపంలో చూపించారు. దాంతో బీజేపీ మహారాష్ట్రలో గెలవడం అంటే చాలా శ్రమించాల్సి ఉంది.

అలాగే బీహార్ లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. అక్కడ ఇండియా కూటమి బలంగా ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలలో బీజేపీ బలం పెంచుకోవాల్సి ఉంది. ఈ మొత్తం పరిణామాలను బేరీజు వేసుకున్న మీదటనే బీజేపీకి జవసత్వాలు అందించే కొత్త ప్రెసిడెంట్ కావాలని భావిస్తున్నారు.

అందుకే జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి పక్కన పెడుతున్నారు. ఇక ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికే బీజేపీ కొత్త ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. మోడీ కూడా ఈ విషయంలో అంగీకారం తెలిపారు అని అంటున్నారు. ఇక మీదట బీజేపీ పాలనను ఆరెస్సెస్ మరింత జాగ్రత్తగా గమనిస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News