చరిత్రలో తొలిసారి చంద్రుడిపై ఒక ప్రైవేటు సంస్థ ల్యాండర్

చంద్రుడి ఈశాన్య కొనవైపు.. పురాతన అగ్నిపర్వత సానువుల్లో దీన్ని ల్యాండ్ చేసినట్లుగా చెబుతున్నారు.;

Update: 2025-03-03 06:00 GMT

చంద్రుడిపై ఒక ప్రైవేటు సంస్థ సొంతంగా కాలు మోసింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి చోటు చేసుకున్న ఈ ఘటనతో అంతరిక్ష ప్రయోగాలు.. మరీ ముఖ్యంగా చంద్రుడి మీద ఆవాసానికి జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడినట్లుగా చెప్పాలి. అమెరికాకు చెందిన ఫైర్ ఫ్లై ఏరో స్పేస్ సంస్థకు చెందిన ‘బ్లూ ఘోస్ట్’ ల్యాండర్ ఆటోపైలట్ విధానంలో చంద్రుడిపై నెమ్మదిగా ల్యాండ్ అయ్యింది.

చంద్రుడి ఈశాన్య కొనవైపు.. పురాతన అగ్నిపర్వత సానువుల్లో దీన్ని ల్యాండ్ చేసినట్లుగా చెబుతున్నారు. దశాబ్ద కాలం క్రితం పుట్టిన ఈ అంకుర సంస్థ తాజాగా హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పాలి. బ్లూ ఘోస్ట్ ల్యాండింగ్ లో పలు గండాల్ని తప్పించుకున్నట్లుగా ఫైర్ ఫ్లై ఏరో స్పేస్ సంస్థ చీఫ్ ఇంజనీర్ విల్ కోగన్ వెల్లడించారు. ఇప్పటివరకు పలు దేశాలకు చెందిన ప్రైవేటు సంస్థలు చంద్రునిపై ల్యాండర్లను దింపే విషయంలో ప్రయత్నించి ఫెయిల్ అయ్యాయి.

ఆదుపు తప్పటం.. క్రాష్ ల్యాండింగ్.. కూలిపోవటం.. ఒరిగిపోవటం లాంటి అపశ్రుతులతో ఇంతకాలం చంద్రుడి మీద ఒక ప్రైవేటు సంస్థకు చెందిన ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ అయిన పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా తాజాగా ఒక ప్రైవేటు సంస్థ ఈ ఘనతను సాధించటం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికి చంద్రుడిపై విజయవంతంగా ల్యాండర్ ను దించిన దేశాల జాబితా కూడా పరిమితమే. ఆ ఘనతను సాధించిన దేశాల్లో అమెరికా.. రష్యా.. చైనా.. భారత్.. జపాన్ లు మాత్రమే ఉన్నాయి.

ఇంతకూ చంద్రుడిపై ల్యాండ్ అయిన ల్యాండర్ కు పెట్టిన బ్లూ ఘోస్ట్ పేరులో విశేషం ఏమిటన్నది చూస్తే.. అమెరిరకాలో అరుదైన పేడ పురుగు జాతి అయిన బ్లూ ఘోస్ట్ పేరును పెట్టారు. చంద్రుడిపై ల్యాండ్ అయిన అరగంటకే తాను ల్యాండ్ అయిన పరిసరాల ఫోటోల్ని తీసి అమెరికాలోని ఆస్టిన్ నగరంలో ఉన్న సంస్థ మిషన్ కంట్రోల్ కేంద్రానికి పంపింది. నాలుగు కాళ్ల ఈ ల్యాండర్ ఎత్తు 2 మీటర్లు కాగా వెడల్పు 3.5 మీటర్లు.

జనవరి 15న ఫ్లోరిడాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. చంద్రుడిపై ధూళిని ఈ ల్యాండర్ పరీక్షించనుంది. పది అడుగుల లోతు రంధ్రం చేసి అక్కడి మట్టిని పరిశీలించనుంది. నాసా వ్యోమగాముల స్పేస్ సూట్ పై పేరుకుపోయే చంద్రధూళిని దులిపేసే పరికరం పని తీరును కూడా అక్కడ టెస్టు చేశారు.

ఇదిలా ఉండగా.. ఈ గురువారం ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థకు చెందిన నాలుగు మీటర్లు ఎత్తైన ల్యాండర్ ను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణ ధ్రువానికి వంద మైళ్ల దూరంలో దీన్ని ల్యాండ్ చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఒక ల్యాండర్ ను విజయవంతంగా దించినా.. ఆ క్రమంలో ఒక కాలు విరగటంతో అది నిరుపయోగంగా మారింది. రెండేళ్ల క్రితం ఈ సంస్థ ఒక ల్యాండర్ ను ప్రయోగించినా అది వేగంగా ఢీ కొని చంద్రునిపై కూలిపోయింది. జపాన్ కు చెందిన ఐస్పేస్ సంస్థ ల్యాండర్ కూడా త్వరలో చంద్రుడిపై ప్రయోగానికి సిద్ధమవుతోంది.

Tags:    

Similar News