రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుళ్లు.. చెల్లాచెదురుగా మృతదేహాలు..

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Update: 2024-11-09 09:38 GMT

పాకిస్తాన్‌లో బాంబులు పేలుతూనే ఉన్నాయి. మరోసారి బాంబులతో దద్దరిల్లింది. ఈసారి రైల్వే స్టేషన్‌ను టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఫలితంగా 24 మంది మృత్యువాతపడ్డారు. ఒక్కసారిగా బాంబ్ పేలడంతో మృతదేహాలంతా చెల్లాచెదురుగా పడ్డాయి. మరో 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. వీరిలోనూ కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

పాకిస్తాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. క్వెట్టా-పెషావర్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్లడానికి ముందే ఈ పేలుడు జరిగింది. ఒక్కసారిగా బాంబ్ పేలింది. ఆ సమయంలో అక్కడ వంద మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. బాంబు పేలుడుతో 24 మంది చనిపోయినట్లు క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ మహ్మద్ బలోచ్ వెల్లడించారు. అయితే దీనిని ఆత్మాహుతి చర్యగా అనుమానిస్తున్నట్లు తెలిపారు.

బలూచిస్తాన్ వేర్పాటువాద సంస్థలకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడే తనను తాను పేల్చుకొని ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు మహ్మద్ బలోచ్ చెప్పారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో రైల్వే స్టేషన్‌కు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిపించారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. వీరి తనిఖీల్లో ఎక్కడా అనుమానిత వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ లభ్యం కాలేదని బలూచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షహీద్ రిండ్ తెలిపారు.

కాగా.. ఈ ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు యూసుఫ్ రజా గిలానీ, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి స్పందించారు. పేలుడు అనేది పిరికిపందల చర్య అని పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి మృతికి సంతాపం ప్రకటించారు. బాంబు పేలుడు తర్వాత క్వెట్టా నగరం వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలకు అదనపు బలగాలను పంపించారు. మరిన్ని పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.

Tags:    

Similar News