రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? బొత్స ఫైర్
ఇప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేశారని చెప్పాలి.
సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా కూటమి సర్కారుపై నిప్పులుచెరిగారు. అంతేకాదు.. ఇప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేశారని చెప్పాలి. ఇంతకూ ఆయన చేసిన వ్యాఖ్యను చూస్తే.. కాస్త గందరగోళానికి గురి చేసేలా ఉండటం గమనార్హం.
ఇంతకూ బొత్స ఏమన్నారంటే.. ‘‘మూడేళ్ల క్రితం రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ఏ2గా ఉన్న నిందితుడికి సాక్షాత్తూ అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి రూ.5 లక్షలు ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు.. స్థానిక ఎమ్మెల్యే.. ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అక్కడితో ఆగని ఆయన మరిన్ని వ్యాఖ్యలు చేశారు.
ఆ ఘటన జరిగినప్పుడు తమ ప్రభుత్వం అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్లుగా కూటమి సర్కారు బావిస్తే.. ఆ అంశాన్ని విచారణ జరపాలన్నారు. ఆ కేసును వెనక్కి తీసుకొని.. తప్పుడు కేసు పెట్టిన సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘ఒకవేళ అతను నిందితుడే కాదని చెప్పదల్చుకుంటే.. కూటమి ప్రభుత్వం అసలు నిందితుడ్ని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలి. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయనిధి నుంచి నిందితుడికి ఇచ్చి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు. నిందితుడికి డబ్బులు ఇవ్వటం మీ ఉద్దేశమా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇంత దారుణం జరుగుతుంటే హిందూ సనాతనవాదిగా గొప్పగా ప్రకటించుకున్న పవన్ కానీ.. హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేసుకునే బీజేపీలు ఏం చేస్తున్నాయి? వారెందుకు నోరు విప్పటం లేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఈ ఘటన జరిగినప్పుడు దేవుడి మీద అలవిమాలిన భక్తిని ప్రదర్శించిన మీరు నానా హంగామా చేశారు. ఇప్పుడు అదే కేసులో నిందితుడికి సాయం చేస్తుంటే.. ఆ పాపంలో మీ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి’ అంటూ విరుచుకుపడ్డారు.
ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వంపై ఫోకస్ పెట్టాలన్న బొత్స.. హామీల్ని కచ్ఛితంగా నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. విజయవాడలో వరదలు.. తిరుమలలో తొక్కిసలాటలు.. ఇవన్నీ మానవ తప్పిదాలేనంటూ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ అంటూ అర్భాటంగా ప్రచారం చేస్తున్నారని.. కానీ ప్యాకేజీ పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నట్లుగా అనుమానాల్ని వ్యక్తం చేశారు. మొత్తానికి సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్సకు సమాధానం ఇవ్వటం ద్వారా రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు అండ్ కో మీద పడిందని చెప్పకతప్పదు.