బొత్స పెర్ఫార్మెన్స్ ఓకేనా ?
వైసీపీలో ఇపుడు జగన్ కంటే కూడా కీలక పాత్రలో ఉన్న వారు సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అని చెప్పాలి
వైసీపీలో ఇపుడు జగన్ కంటే కూడా కీలక పాత్రలో ఉన్న వారు సీనియర్ నేత శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అని చెప్పాలి. ఆయన కేబినెట్ హోదాను అనుభవిస్తున్నారు. మండలిలో ఆయన హోదాకు ఇపుడు కాదు ఎపుడూ తేడా లాదు. ఎందుకంటే మండలి మొత్తం సభ్యుల సంఖ్య యాభై ఎనిమిది. అందులో పది శాతం అంటే ఆరు మంది ఎమ్మెల్సీలు ఉన్నా బొత్సకు ఆ హోదా గ్యారంటీ.
చూస్తే వైసీపీకి శాసనమండలిలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలు ఉన్నారు. అలా 2028 చివరాఖరు వరకూ బొత్స మండలిలో లీడర్ ఆఫ్ అపొజిషన్ గా కేబినెట్ హోదాతో ఉంటారు. ఒక విధంగా బొత్సకు ఇది అదృష్టమని చెప్పాలి. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీగా నెగ్గి మండలికి వచ్చిన బొత్స ఈ కీలక పాత్రలో తన పెర్ఫార్మెన్స్ తో ఓకే అనిపించుకుంటున్నారా అన్నది వైసీపీలో చర్చగా ఉంది.
వైసీపీ అధినేత జగన్ సహా 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. దాంతో వైసీపీ వాయిస్ ఏమైనా వినబడాలీ అంటే అది శాసనమండలిలోనే అని అంటున్నారు. అప్పట్లో అంటే 2019 నుంచి 2022 మధ్య మూడేళ్ళ కాలంలో టీడీపీకి మండలిలో భారీ సంఖ్యాబలం ఉండేది. దాంతో అక్కడ వైసీపీ ప్రవేశపెట్టిన ప్రతీ బిల్లూ వీగిపోయేది. అలా కీలకమైన మూడు రాజధాని బిల్లుని కూడా గట్టిగా అడ్డుకున్నారు.
అపుడు తెలిసింది మండలి పవర్ ఏమిటి అన్నది వైసీపీకి. అలా మండలిలో టీడీపీ పోషించిన పాత్ర గ్రేట్ అనే చెప్పాలి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా బిల్లులు మాత్రం ఆమోదం పొందడంలేదని ఒక దశలో జగన్ మండలిని రద్దు చేయాలని చూశారు. దానికి సంబంధించి శాసనసభ ప్రత్యేకంగా సమావేశపరచి మండలి రద్దుకు కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు కూడా.
అంతలా మండలిలో టీడీపీ పెర్ఫార్మెన్స్ ఉంటే ఇపుడు వైసీపీకి మెజారిటీ ఉండి కూడా ఆ తరహా పెర్ఫార్మెన్స్ కనిపించడం లేదని అంటున్నారు. మండలిలో వైసీపీ తరఫున మాట్లాడే గొంతుకలు కూడా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. చాలామంది ఎమ్మెల్సీలు పక్క చూపులు చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ఇచ్చినా ఆయన ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో వారి రాజీనామాలు పెండింగులో ఉన్నాయి.
దాంతో మిగిలిన వారు కూడా ఆలోచిస్తున్నారు. లేకపోతే ఈపాటికి మండలిలో టీడీపీకి పెద్ద ఎత్తున వైసీపీ నుంచి ఫిరాయింపులతో మెజారిటీ వచ్చేసేదే అని అంటున్నారు. ఇక అసెంబ్లీలో కీలక అంశాల మీద చర్చించాలని చూసినా కూడా వైసీపీ నుంచి ధాటీగా మాట్లాడేవారు కనిపించడం లేదు అని అంటున్నారు. వరుదు కళ్యాణి వంటి వారు ఒకరిద్దరు మాత్రమే మండలిలో వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడుతున్నారు.
ఇక బొత్స సత్యనారాయణ దూకుడు చేయడం లేదని కూడా అంటున్నారు. ఆయన పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. మీరంటే మాకు ఎంతో గౌరవం అని అధికార కూటమి సభ్యులు బొత్స గురించి అంటున్నారు. బొత్స కూడా వైసీపీ అధినాయకత్వం ఆశించిన స్థాయిలో ఫైర్ చూపించడంలేదు అన్న చర్చ సాగుతోందిట.
సూపర్ సిక్స్ హామీలను గురించి ప్రస్తావించి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని అధినాయకత్వం కోరుకుంటోంది కానీ మండలిలో అయితే మంత్రులు వైసీపీ ఎమ్మెల్సీలు లేవనెత్తే ప్రశ్నలకు సమర్ధవంతంగా జవాబులు చెబుతూ వారిని కట్టడి చేస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే వాకౌట్లు చేయడం తప్ప వైసీపీ పెద్దగా వ్యూహాలను రచించలేకపోతోందని అంటున్నారు. ఇక మండలిలో కూటమి బిల్లులకు కూడా వైసీపీ నుంచి కొందరు సైలెంట్ గా సహకరిస్తున్నారు అని అంటున్నారు. దీంతో మండలి ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్న వైసీపీ అధినాయకత్వానికి అనుకున్నట్లుగా అక్కడ వ్యూహాలు పనిచేయడం లేదని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏమి జరుగుతుందో.