ఫ్యామిలీ ప్యాకేజ్ పైన బొత్స మాట ఇదే !

విజయనగరం జిల్లాలో సీనియర్ వైసీపీ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ప్యాకేజ్ గురించే అంతా చెప్పుకుంటూ ఉంటారు.

Update: 2024-04-30 03:47 GMT

విజయనగరం జిల్లాలో సీనియర్ వైసీపీ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ప్యాకేజ్ గురించే అంతా చెప్పుకుంటూ ఉంటారు. బంధువులు, సన్నిహితులు, స్నేహితులు అస్మదీయులు ఇలా అంతా ఆయన వారే ఎక్కడ చూసిన కనిపిస్తారు. విజయనగరం జిల్లాలో 2019లో జగన్ బొత్స ఎవరికి టికెట్ అంటే వారికే ఇచ్చారు. ఈసారి కటింగులు ఉంటాయని విపరీతంగా ప్రచారం సాగింది.

కానీ ఒక్క అభ్యర్ధిని కూడా మార్చలేదు సరి కదా బోనస్ గా ఆయన సతీమణికి విశాఖ వంటి ప్రముఖ నగరానికి ఎంపీ సీటు ఇచ్చారు. దీంతో బొత్స పలుకుబడి జగన్ వద్ద ఏ స్థాయిలో ఉందో అన్నది వైసీపీ లోపలా బయటా టాక్ నడచింది. ఇదే విషయం మీద ఒక చానల్ ఇంటర్వ్యూలో బొత్స మాట్లాడుతూ ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నది ఏదీ లేదని అన్నారు. తాము నామినేటెడ్ పదవులు తీసుకోలేదని గుర్తు చేశారు.

అంతా ప్రజల నుంచి నెగ్గిన వారే అని అంటున్నారు. గెలుస్తున్నారు. సమర్ధులు అని మాత్రమే టికెట్లు ఇస్తున్నారు తప్ప ఫ్యామిలీ వారు అని ఎక్కడా లేదని సమర్ధించుకున్నారు. ఇక తాను 1999లోనే ఎంపీని అయ్యాను అని ఆయన చెప్పారు. విషయం ఏంటి అంటే 1999లో బొత్స ఎంపీ అయ్యారు. అప్పుడు ఆయన తమ్ముడు సహా ఎవరూ పదవులలో లేరు.

అలాగే 2004లో కూడా బొత్స ఒక్కరే చీపురుపల్లి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టి కుదురుకోవడం తోనే జెడ్పి చైర్ పర్సన్ గా

బొత్స సతీమణి ఝాన్సీ రంగ ప్రవేశం చేశారు. డిప్యూటీ చైర్ పర్సన్ గా బెల్లాన చంద్రశేఖర్ చేశారు. 2009లో తమ్ముడు అప్పల నరసయ్య విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక ఆ తరువాత నెల్లిమర్ల ఎస్ కోట ఇలా చాలా చోట్ల బొత్స బంధువులు సన్నిహితులు గెలిచారు.

వైసీపీలోకి చేరాక ఆ సంఖ్య మరింతగా పెరిగింది. అయితే ఒక్క విషయం చెప్పుకోవాలి. బొత్సకు వైఎస్సార్ ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో జగన్ కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. ఇంకా ఎక్కువ ఇచ్చారు. అందుకే ఆనాడు లేనన్ని పదవులు ఈనాడు ఆయన కుటుంబంలో ఉన్నాయని అంటున్నారు.

వైఎస్సార్ కి జగన్ కి తేడా చెబుతూ బొత్స ఒక మాట అన్నారు. జగన్ అందరు చెప్పినదీ వింటారు అని ప్రజలకు ఏది మేలో ఆ కోణం నుంచే దానిని అమలు చేస్తారు అని. వైఎస్సార్ కూడా అందరి మాట విని కొన్ని సార్లు వారు చెప్పినది కూడా చేసేవారూ అని. ఏది ఏమైనా జగన్ గొప్ప పాలకుడు అని బొత్స కీర్తిస్తున్నారు.

ఒకనాడు విజయనగరం జిల్లా వరకూ ఉన్న బొత్స ఇపుడు విశాఖ జిల్లా దాకా కూడా తన రాజకీయాన్ని విస్తరించారు. ఈసారి బొత్స ఝాన్సీ ఎంపీగా గెలిస్తే రెండు జిల్లాలలో ఆయన రాజకీయ ప్రాపకం మరింతంగా పెరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం వస్తే ఉత్తరాంధ్రాకే ఆయన కీలక నేతగా మారిపోతారు అని అంటున్నారు.

Tags:    

Similar News