"చంద్రబాబు నయవంచకుడు" - బొత్స సత్యనారాయణ
ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. ఈ లేఖ విషయం ఇలా బయటకు పొక్కగానే.. మంత్రి బొత్స అలా రియాక్ట్ అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో వైసీపీ సర్కారు వెంటనే స్పందిస్తోంది. చంద్రబాబు కుటుంబ సభ్యులు కానీ, టీడీపీ నాయకులు కానీ చేస్తున్న వ్యాఖ్యల విషయంలో వైసీపీ స్పాట్ రియాక్షన్ ఇస్తోంది. బాబును అరెస్టు చేసి, జైల్లో పెట్టిన నేపథ్యంలో ప్రజల మధ్య కొన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపుల నేపథ్యంలోనే వైసీపీ సర్కారు చంద్రబాబును అరెస్టు చేసిందన్న టీడీపీ ప్రచారం జోరుగా ప్రజల్లో హల్చల్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో సదరు చర్చకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చాలా దూకుడుగా ఉన్నారు. బాబు సతీమణి భువనేశ్వరి చేస్తున్న నిజం గెలవాలి యాత్ర నుంచి ఆమె చేస్తున్న వ్యాఖ్యలపైనా ఆయన రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. ఈ లేఖ విషయం ఇలా బయటకు పొక్కగానే.. మంత్రి బొత్స అలా రియాక్ట్ అయ్యారు.
చంద్రబాబు తన ప్రాణాలకు ముప్పు ఉందని.. భద్రత విషయంలో ఆందోళన ఉందని తెలియజేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాయడాన్ని బొత్స వ్యంగ్యంగా తిప్పికొట్టారు. "చంద్రబాబు ఎన్ని ప్రేమ లేఖలు రాసినా.. చట్టం తన పనితాను చేసుకుని పోతుంది! చంద్రబాబును కాపాడే వారు ఎవరూ లేరు" అని వ్యాఖ్యానించా రు. చంద్రబాబు నయవంచుకుడని మంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు, బాబు.. నందిని పంది, పందిని నంది చేయగల సమర్థుడని అన్నారు.
టీడీపీ-జనసేనల పొత్తుపై మంత్రి మాట్లాడుతూ.. అది అపవిత్రమైన పొత్తుగా అభివర్ణించారు. ఈ పొత్తును ప్రజలు విశ్వసించడం లేదన్నారు. "అదీ ఒక పొత్తేనా.? ప్రజలు ఎవరు విశ్వసిస్తున్నారు? రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి. అది ఒక్క జగన్‌కే సాధ్యమైంది. చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌లు తలకిందులుగా తపస్సు చేసి.. ఎన్ని పొత్తులు వేసినా.. ప్రజలను నమ్మించలేరు" అని బొత్స అన్నారు.