బొత్స గెలిస్తే వైసీపీ లో ఏం జరుగుతుంది ?
వైసీపీ కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ విశాఖ నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు.
వైసీపీ కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ విశాఖ నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. ఆయన గెలుస్తారా అంటే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగని ఈజీగా గెలిచేస్తారు అని చెప్పడానికి లేదు. టీడీపీ కూటమి పోటీకి దిగితే మాత్రం వైసీపీకి చుక్కలు చూపించడం ఖాయం. అందుకే జగన్ కూడా రంగంలోకి దిగిపోయారు.
ఇదిలా ఉంటే బొత్స గెలిస్తే అది వైసీపీకి బూస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది. అంతే కాదు విశాఖ జిల్లాలో వైసీపీ మళ్లీ లేచి నిలబడడానికి ఒక ఆస్కారం ఇచ్చినట్లుగా ఉంటుంది. అదే విధంగా అటు శాసనమండలిలో ఒక సీనియర్ నేత పార్టీకి దొరికిన వారు అవుతారు.
అదే విధంగా ఆయన ద్వారా కూటమి ప్రభుత్వం మీద సీరియస్ గా విమర్శలు చేయించడం ద్వారా వైసీపీకి పొలిటికల్ మైలేజ్ సాధించాలని జగన్ భావిస్తున్నారు. వైసీపీ ఇపుడు విపక్షంలో ఉంది ధీటైన నాయకులు కావాలి. ఆ లోటుని బొత్స తీరుస్తారు అన్నది జగన్ బలంగా నమ్ముతున్నారు.
వైసీపీ వరకూ చూస్తే ఇపుడు గడ్డు కాలం నడుస్తోంది. పార్టీలో పూర్తిగా స్తబ్దత ఆవరించింది. వైసీపీ నుంచి చూస్తే ఎవరూ గట్టిగా బయటకు మాట్లాడడానికి ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. బొత్సని గెలిపించడం ద్వారా వీటికి జవాబు చెప్పాలని జగన్ భావిస్తున్నారు. మళ్లీ పార్టీ పుంజుకుంటోంది అన్న సంకేతాలు పార్టీ జనాలకు పంపించాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.
ఇంకో వైపు చూస్తే ఉత్తరాంధ్ర కు కేంద్ర బిందువుగా విశాఖ ఉంది. విశాఖ ముఖ ద్వారం గా చేసుకుని ఉత్తరాంధ్ర పాలిటిక్స్ సాగుతోంది. అగ్నికి వాయువు తోడు అన్నట్లుగా అసలే బలంగా ఉన్న టీడీపీకి జనసేన తోడు అయింది. ఈ రెండు పార్టీలూ విశాఖలో గట్టిగా ఉన్నాయి. బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అయిన సీఎం రమేష్ కూడా పవర్ ఫుల్ నేతగా కూటమి నుంచి కనిపిస్తున్నారు.
మరి ఇంతమందిని కట్టడి చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఎన్నికల్లో విశాఖలో వైసీపీ ఓటమి పాలు కావడం కాదు, కకావికలు అయింది. వైసీపీకి విశాఖలో గట్టి నేతలు ఎవరూ లేరు అన్నది అందరికీ తెలిసిందే. ఆ లోటుని తీర్చేందుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ని ప్రోత్సహించినా ఆయన ఆశించిన స్థాయిలో పని చేయలేక పోతున్నారు అని అంటున్నారు.
ఆయన జిల్లా నేత అవుతారు అనుకున్నారు కానీ ఆయన మొత్తం పార్టీని కట్టడి చేయలేకపోతున్నారు. పార్టీలో సర్వామోదం ఆయన దక్కించుకోలేక పోతున్నారు. కూటమి ఎత్తులకు పై ఎత్తు వేయాల్సిన వేళ మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి వారు ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు.
అందుకే బొత్సను గెలిపించుకుంటే విశాఖ జిల్లా కేంద్రంగా కూటమి సాగిస్తున్న రాజకీయానికి అడ్డుకట్ట వేయాలని కూడా వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అలాగే విశాఖ జిల్లా రాజకీయాలను సైతం చక్కబెట్టేలా వైసీపీ చూస్తోంది. మొత్తానికి బొత్స గెలుపుతో ఇటు స్వపక్షంతో పాటు అటు విపక్షానికి కూడా ఒక జవాబు చెప్పాలన్నదే వైసీపీ అధినాయకత్వం ఆలోచన అని అంటున్నారు. మరి బొత్స విజయం సాధిస్తేనే ఇవన్నీ జరిగేది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.