టీటీడీ ఛైర్మన్ గా ఎంపికైన టీవీ5 అధినేత రియాక్షన్ ఇదే
ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబును ఒప్పించి.. తాను అనుకున్నట్లుగా కోరుకున్న పదవికి ఎంపికయ్యేలా చేసుకోవటంలో బీఆర్ నాయుడు విజయవంతమయ్యారని చెప్పాలి.
అంచనాలే నిజమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరున్న న్యూస్ చానళ్లలో టీవీ5 ఒకటి. దాని అధినేత బీఆర్ నాయుడికి అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా ఎంపిక చేస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ పదవిపై టీవీ5 అధినేత మనసు పడ్డారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబును ఒప్పించి.. తాను అనుకున్నట్లుగా కోరుకున్న పదవికి ఎంపికయ్యేలా చేసుకోవటంలో బీఆర్ నాయుడు విజయవంతమయ్యారని చెప్పాలి.
తనను టీటీడీ బోర్డు ఛైర్మన్ గా ఎంపిక చేసిన నేపథ్యంలో బీఆర్ నాయుడు స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు గొప్ప బాధ్యతను అప్పగించినట్లుగా పేర్కొన్న ఆయన.. తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఎన్డీయే కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. తాను తిరుమలలో పుట్టి పెరిగానని.. అక్కడి విషయాలన్నింటి మీదా తనకు బాగా తెలుసన్నారు.
ఈ కారణంగానే తన బాధ్యత మరింత పెరిగిందన్న బీఆర్ నాయుడు.. ‘తిరుమలలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ మేరకు చంద్రబాబుతో చర్చించా. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఆయనతో చర్చించి.. నిర్ణయాలు తీసుకుంటాను.తిరుమలను ఏ విధంగా బాగు చేయాలి. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి ? లాంటి అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి అమలు చేస్తాం’’ అని పేర్కొన్నారు.
తాము తీసుకునే అన్ని నిర్ణయాలు పాలక మండలి ఆమోదంతోనే చేపడతామన్న ఆయన.. ఈ బాధ్యత పూర్వజన్మ సుక్రతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ నాయుడ్ని టీటీడీ ఛైర్మన్ గా ఎంపిక చేసిన వైనంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్టు అయ్యారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. తిరుమల పవిత్రతను.. ఔన్నత్యాన్ని మరింతపెంచేలా వ్యవహరించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇక.. టీటీడీ బోర్డు విషయానికి వస్తే.. ఛైర్మన్ గా టీవీ5 ఛానల్ అధినేత.. బోర్డు సభ్యుల్లో నలుగురు తెలంగాణ వారికి చోటు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.