బెంగళూరు ఎయిర్ పోర్టులో ఖరీదైన వాచీల్నిదర్జాగా కొట్టేశాడు

బ్రెజిల్ కు చెందిన 34 ఏళ్ల ఒక విదేశీ ప్రయాణికుడు.. తన స్వదేశానికి వెళ్లేందుకు బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Update: 2025-01-17 05:26 GMT

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రమయంలో ఒక విదేశీ దొంగ ప్రదర్శించిన చేతివాటం షాకింగ్ గా మారింది. ఖరీదైన వాచీలను ఇట్టే కొట్టేసిన ఈ ఘనుడు.. సదరు షాపులోని వ్యక్తికి.. ‘మీరు నన్నెప్పటికి మర్చిపోలేరంటూ’ వ్యాఖ్యానించి వెళ్లిపోయాడు. అయితే.. అతడి మాటల్లోని అసలు అర్థం నాలుగురోజులకు కానీ అర్థం కాని పరిస్థితి. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. సదరు విదేశీ దొంగ చేతివాటం టాలెంట్ ఎంతన్నది అర్థమవుతుంది.

బ్రెజిల్ కు చెందిన 34 ఏళ్ల ఒక విదేశీ ప్రయాణికుడు.. తన స్వదేశానికి వెళ్లేందుకు బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులోని ఒక లగ్జరీ వాచ్ దుకాణానికి వెళ్లాడు. అక్కడి సేల్స్ మెన్ అతడికి వాచీలను చూపించాడు. ఈ క్రమంలో ఒక వాచ్ ను కొనుగోలు చేశాడు. మరిన్ని వాచ్ లను చూపించాలని కోరాడు. ఆ పనిలో సేల్స్ పర్సన్ మునిగిపోయిన సమయంలో రూ.94 వేలకు పైనే విలువైన ఒక ఫ్రెడ్రిక్ కాన్ స్టాంట్ వాచ్ ను కొట్టేశాడు.

గంట పాటు అక్కడే ఉండి మరో మూడు ఖరీదైన వాచ్ లను కొనుగోలు చేశాడు. తన ప్లాన్ లో భాగంగా తన పాస్ పోర్టు.. బోర్డింగ్ పాస్ లను షాప్ కౌంటర్ వద్ద వదిలేసి.. బయటకు వచ్చాడు. తర్వాత తాను హడావుడిలో తన పాస్ పోర్టు.. బోర్డింగ్ పాస్ లను మర్చిపోయినట్లుగా పేర్కొంటూ కౌంటర్ వద్దకు వచ్చి.. చేతి వాటాన్ని ప్రదర్శించి రూ.2.4 లక్షల విలువైన వాచ్ ను కొట్టేశాడు.

తిరిగి వెళ్లే టైంలో.. తనను ఎప్పటికి మర్చిపోలేరని.. బెస్టు ఫారిన్ కస్టమర్లలో తాను ఒకడిగా ఎప్పటికి మిగిలిపోతానంటూ అక్కడి సిబ్బందికి మాటలు చెప్పేసి.. చల్లగా జారుకున్నాడు. ఈ ఉదంతం జరిగిన రెండు రోజులకు షోరూంలో స్టాక్ ఆడిట్ జరిగింది. ఈ క్రమంలో ఖరీదైన వాచీలు కనిపించకుండా పోయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే.. సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలించగా.. బ్రెజిల్ ప్రయాణికుడి ఘనకార్యం బయటకు వచ్చింది. దీంతో.. షాప్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. మొత్తంగా చూస్తే.. నిందితుడు రూ.8 లక్షల విలువైన నాలుగు వాచ్ లను కొనగా.. రూ.3.3 లక్షల విలువైన రెండు వాచీలను కొట్టేసినట్లుగా గుర్తించారు.

Tags:    

Similar News