హాట్‌ టాపిక్‌.. బ్రదర్‌ అనిల్‌ తో టీడీపీ ఎమ్మెల్సీ భేటీ!

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది

Update: 2024-01-03 10:39 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ అభ్యర్థుల స్థానాల్లో మార్పులు చేర్పులతో ముందుకు సాగుతున్నారు. ఇంకోవైపు టీడీపీ, జనసేన కూటమి అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ వరుస సభలు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తాజాగా వైఎస్‌ జగన్‌ బావ, ఆయన సోదరి షర్మిల భర్త అయిన బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ తో భేటీ కావడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి (బీటెక్‌ రవి అసలు పేరు) పులివెందుల నియోజకవర్గానికి చెందినవారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన పోరాడుతున్నారు. ఇటీవల బీటెక్‌ రవిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కడప విమానాశ్రయంలో నిబంధనలను మీరి ప్రవర్తించారని, పోలీసులతో గొడవ పడ్డారని ఆరోపిస్తూ ఆయనను ఇటీవల అరెస్టు చేశారు.

అయితే పోలీసులు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో తనపై తప్పుడు కేసు పెట్టారని.. తనను ఒక రోజంతా కిడ్నాప్‌ చేశారని బీటెక్‌ రవి ఆరోపించి కలకలం రేపారు. అంతేకాకుండా ఆయన భార్య కోర్టును ఆశ్రయించారు. తన భర్త ఆచూకీ తెలియడం లేదని.. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్లారని తనకు సమాచారం ఉందని కోర్టుకు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో బీటెక్‌ రవి పులివెందుల నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ పైన బీటెక్‌ రవి పోటీ ఖాయమేనని చెబుతున్నారు. ఆయన నిత్యం ప్రభుత్వ వైఫల్యాలపై, సీఎం జగన్‌ నిర్ణయాలపై విరుచుకుపడుతున్నారు.

ఈ క్రమంలో జనవరి 3న కడప విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌ బావ, షర్మిల భర్త అయిన బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ను బీటెక్‌ రవి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది, ఎయిర్‌ పోర్టులో బీటెక్‌ రవి, బ్రదర్‌ అనిల్‌ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విమానాశ్రయంలో జరిగిన ఈ అనధికారిక సమావేశం మారిన రాజకీయ పరిస్థితుల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

వైఎస్‌ షర్మిల తన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరనున్నారు. ఈ వ్యవహారంలో బ్రదర్‌ అనిల్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న బ్రదర్‌ అనిల్, షర్మిలకు బీటెక్‌ రవి శుభాకాంక్షలు తెలిపారని టాక్‌ నడుస్తోంది. అలాగే కడప జిల్లా రాజకీయాల గురించి కాసేపు మాట్లాడుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News