బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికరమైన చర్చ!
ఈ సందర్భంగా పాస్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు, తదనంతరం ఇతర పాస్టర్లు స్పందించి పలికిన పలుకులు రాజకీయంగా ఆసక్తిగా మారాయి.
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలూ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్న వేళ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ భర్త బ్రదర్ అనిల్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాస్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు, తదనంతరం ఇతర పాస్టర్లు స్పందించి పలికిన పలుకులు రాజకీయంగా ఆసక్తిగా మారాయి. దీంతో... బ్రదర్ అనీల్ పాలిటిక్స్ షురూ చేసినట్లేనా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
అవును... ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ - జనసేన పొత్తులో ఉండగా.. వీరితో బీజేపీ కూడా కలిసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక తాజాగా వైఎస్ షర్మిళ ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్ లో కూడా కొత్త ఉత్సాహం వచ్చిందని అంటున్నారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ షర్మిళ మైకు పట్టుకున్న ప్రతీసారి వైఎస్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన బ్రదర్ అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... "దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచి చేపడితే అసాధ్యమైన పని సుసాధ్యమవుతుంది! తను ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక పిలుపునిస్తాడు! బలవంతులను సిగ్గు పరచడానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటారు!" అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల్లో "బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎంచుకుంటారు" అని చెప్పిన విషయాన్ని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు.
ఇందులో భాగంగా... "బలవంతుడు – బలహీనుడు"... సమయంలో బలహీనుడి తరుపున దేవుడు యుద్ధం చేయడం వంటి వ్యాఖ్యలకు బైబిల్ గ్రంథంలో "దావీదు - గొల్యాతు" అంశం బెస్ట్ ఉదాహరణ అని అనుకోవచ్చు. మహా బలిష్టుడు.. చేతిలో కత్తి, డాలు.. శరీరానికి కవచం, తలపై కిరీటం ధరించిన వ్యక్తిని దావీదు అనే గొర్రెలను కాచుకునే బాలుడు ఒడిశెతో కొట్టి నేలకూలుస్తాడు! ఇది పూర్తిగా దేవుడు చేసిన యుద్ధమే అని చెబుతాడు. దీంతో... ఇజ్రాయేలీయులు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారు.
కట్ చేస్తే... తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పెంతెకోస్తు ఫెలోషిప్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన పాస్టర్లతో జరిగిన సమావేశంలో అనిల్ కుమార్ పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి పలువురు పాస్టర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మైకందుకున్న అనిల్... తాను ఇక్కడకు రాజకీయాలు మాట్లాడడానికి, ఓట్లు అడిగేందుకు రాలేదని.. కేవలం దేవుని రాజ్యం గురించి మాట్లాడేందుకే వచ్చానని చెబుతూ... "బలవంతుడు - బలహీనుడు" అనే అంశం లేవనెత్తడంపై ఈ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.
ఇక్కడ జగన్ ను గొల్యాతుతో.. షర్మిళను దావీదుతో పోల్చే ప్రయత్నం అనిల్ చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రకంగా ఆయన స్టైల్లో ఆయన పొలిటికల్ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారని అంటున్నారు పరిశీలకులు! ఆ సంగతి అలా ఉంటే... 2009 ఎన్నికల తర్వాత సోనియాతోనూ, 2019 ఎన్నికల్లో చంద్రబాబుతోనూ పైనచెప్పుకున్న "బలవంతుడు - బలహీనుడు" యుద్ధం జగన్ నాడే చేశారని.. అదే అసలు సిసలైన "దావీదు - గొల్యాతు" స్టోరీ అని అంటున్నారు వైసీపీ ఫ్యాన్స్!!