బీఆర్ఎస్ లో ''సీఎం..సీఎం'' స్ట్రాటజీ ఏంటబ్బా!
తెలుగు రాష్ట్రాల్లో సీఎం పదవికి ఉన్న క్రేజ్ ఏ పదవికి ఉండదు. ఎవరు కొత్త పార్టీ పెట్టినా..ఉన్న పార్టీలో ఎదగాలన్న అందరి చూపు సీఎం కుర్చిపైనే.
తెలుగు రాష్ట్రాల్లో సీఎం పదవికి ఉన్న క్రేజ్ ఏ పదవికి ఉండదు. ఎవరు కొత్త పార్టీ పెట్టినా..ఉన్న పార్టీలో ఎదగాలన్న అందరి చూపు సీఎం కుర్చిపైనే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సీఎం పదవికి ఉన్న పవర్ అలాంటిది. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్..ఇలా పలువురు సీఎం పదవికి వన్నె తెచ్చారు. ఆ పదవికి ఉన్న క్రేజ్ ను మరింత పెంచేశారు. అందుకే ప్రతీ రాజకీయ నాయకుడి కల సీఎం అనిపించుకోవడమే. మన రాష్ట్రాల్లో సీఎం పదవికి ఎంత క్రేజ్ ఉంటుందంటే..1996-98 ప్రాంతంలో చంద్రబాబుకు పీఎం అవకాశం వచ్చింది. అయినా నాకు పీఎం పదవి వద్దు..ఏపీకి సీఎంగానే ఉంటానని ఆయన తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత ఆ పదవిని దేవెగౌడ అధిష్ఠించారు. అందుకే మన సౌత్ రాష్ట్రాల్లోని నాయకులంతా సీఎం కావాలని పరితపిస్తుంటారు. సీఎం..సీఎం అని స్లోగన్స్ తో హోరెత్తించాలని క్యాడర్ కు సూచిస్తుంటారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా దూకుడుగానే వెళ్తోంది. మాజీ సీఎం కేసీఆర్ సైతం లైవ్ లోకి వచ్చేశారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత..ఎవరికీ వారు పార్టీ కార్యక్రమాల్లోనూ, అధికార పక్షంపై విరుచుకుపడడంలోనూ ముందుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతీరోజు యాక్టివ్ గా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పిదాలను దొరకపుచ్చుకుని కౌంటర్ లు ఇవ్వడం, ప్రజల్లోకి వెళ్లడం లాంటివి చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా బీఆర్ఎస్ లో సీఎం నినాదాలు మాత్రం అందరినీ గందరగోళానికి గురిచేస్తున్నాయి.
మొన్న తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తే సీఎం..సీఎం అంటూ క్యాడర్ హోరెత్తించారు. ఇక కేటీఆర్ ఏ పార్టీ కార్యక్రమానికి వెళ్లినా.. ఏ మీటింగ్ కు వెళ్లినా ‘‘సీఎం...సీఎం’’ అంటూ అదే కార్యకర్తలు నినదిస్తున్నారు. ఇక కవిత ఎక్కడికి వెళ్లినా సీఎం..సీఎం అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. మరి ఇంతకీ ఇందులో మర్మమేమిటో అర్థం కాదు. వాస్తవానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఎక్కడికి వెళ్లినా రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని..కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెబుతున్నారు. కవిత సైతం అదే చెబుతున్నారు. మరి బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? ఇక హరీశ్ రావు సీఎం నినాదాలు చేయించుకోకపోయినా..ఆయన అభిమానులు అదే కోరుకుంటున్నారు కానీ బయటకు మాత్రం నినాదాలు చేయడం లేదు.
రాబోయే ఎన్నికల్లో గెలిస్తే కేసీఆరే సీఎం అవుతారని అంతా చెబుతున్నప్పుడు కేటీఆర్, కవిత..సీఎం స్లోగన్స్ ను ఎందుకు వారించడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. సీఎం స్లోగన్స్ ను కేసీఆరే వారిస్తుంటారు అప్పుడప్పుడు. కానీ యువ నాయకత్వం మాత్రం సీఎం స్లోగన్స్ ను వారించడం కాదు కదా ఇంకా హోరెత్తించేలా క్యాడర్ ను ఎంకరేజ్ చేసినట్టు కనపడుతోంది. అయితే సీఎం స్లోగన్స్ వెనక స్ట్రాటజీ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో కేసీఆర్ తర్వాతి స్థానం లేదా కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు స్వీకరించి సీఎం పదవిని చేపట్టేందుకు భవిష్యత్ ప్రణాళికే ఈ స్లోగన్స్ అంటున్నారు. నిజానికి కేసీఆర్ తన తర్వాతి స్థానం ఎవరిది అని చెప్పకపోయినా.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా లేదా తనయుడిగా కేటీఆర్ కే ఆ స్థానం అని సగటు ఓటరు..సగటు బీఆర్ఎస్ కార్యకర్త భావిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కేసీఆర్ మాత్రం కేటీఆర్, హరీశ్ రావు, కవితలను ముగ్గురిని ప్రోత్సహిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఈ తరుణంలో సీఎం స్లోగన్స్ తో క్యాడర్ లో కాస్త గందరగోళమైతే ఉన్నట్టు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎవరో ఒకరిని సీఎంగా చూపించి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఏమాత్రం డౌట్ ఉన్న పార్టీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొని..బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే కేసీఆర్ క్రేజ్..ఫేస్ మాత్రమే శరణ్యం.