హైడ్రాకు వంద రోజులు: బీఆర్ఎస్‌ సంచలన కామెంట్స్

ఎంతో మంది అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రా వంద రోజులు పూర్తిచేసుకుంది.

Update: 2024-10-25 05:57 GMT

హైదరాబాద్ మహానగరం పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) తీసుకొచ్చింది. విపత్తుల నివారణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం హైడ్రా పుట్టుకొచ్చింది. అందులో భాగంగా చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసి అక్రమంగా వెలసిన కట్టడాలను కూల్చివేస్తోంది. తన, మన అన్న తేడా లేకుండా అందరి కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఎంతో మంది అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రా వంద రోజులు పూర్తిచేసుకుంది.

హైడ్రాను గత జూలై నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ వంద రోజుల ప్రయాణంలో 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాను హైడ్రా కూల్చివేసింది. ఓఆర్ఆర్ లోపల వరకు మాత్రమే ఈ కట్టడాలనే నేలమట్టం చేసింది. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు హైడ్రా విస్తరించి పనిచేస్తోంది. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ముందుగా ప్రభుత్వం జీవో 99ని ప్రకటించింది. ఆ తరువాత దానికి పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టేందుకు జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారాలను బదలాయించారు. దాంతో హైడ్రాకు మరిన్ని పవర్స్ వచ్చాయి. చివరకు గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ కూడా రావడంతో హైడ్రా మరింత పవర్ ఫుల్ అయింది.

ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జంట జలాశయాలు ఎఫ్టీఎల్‌లో కట్టడాలను, పార్కు స్థలాల్లో మొత్తం 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేయగా.. 111.72 ఎకరాల స్థలాన్ని రికవరీ చేసింది. వీటిలో అత్యధికంగా గాజుల రామారంలోని చింతల్ చెరువుల ఒడ్డున 54 నిర్మాణాలను కూల్చివేశారు. రాజేంద్రనగర్‌లోని భూమురక్ డౌలాలో 45 నేలమట్టం చేశారు. అలాగే.. లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, బాచుపల్లి, చందానగర్, అమీర్‌పేట, అమీన్‌పూర్, గుట్టల బేగంపేట, మల్లంపేట పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

అయితే.. హైడ్రా కూల్చివేతలపై రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉంది. పెద్దలను వదిలి పేదల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. హైడ్రా బాధితుల కోసం పలు సందర్భాల్లో ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. అటు కోర్టుల వరకూ వెళ్లారు. ఫైనల్లీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి సైతం హైడ్రా చర్యలతో పడుతున్న ఇబ్బందులను తీసుకెళ్లారు. తాజాగా.. హైడ్రా వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మరోసారి బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో పేదల జీవితాలను రోడ్డుకీడ్చిందని దుయ్యబట్టింది. వెయ్యెలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లుగా కబ్జాలు ప్రోత్సహించిన కాంగ్రేసే పరిరక్షణ పేరుతో డ్రామాలు ఆడుతోందని విమర్శించింది. పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టేందుకు మనసెలా వచ్చిందని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు అనుముల తిరుపతిరెడ్డి ఇంటికి సంబంధించి ఒక్క ఇటుకనైనా ఎందుకు ముట్టలేకపోయారని నిలదీసింది.

Tags:    

Similar News