తెలంగాణ భవన్.. కేసీఆర్ మాటలు యాదికొస్తున్నయ్!!
నిజానికి తెలంగాణ భవన్.. అంటే బీఆర్ఎస్ నాయకులకు సమస్యల పరిష్కార వేదిక. ఏ సమస్య ఉన్నా.. ఇక్కడకు వచ్చేవారు పరిష్కరించుకునేవారు.;

తెలంగాణ భవన్. ఖచ్చితంగా 15-16 మాసాల కిందటి వరకు అక్కడో పెద్ద కోలాహలం. వచ్చే నాయకులు , వెళ్లే నాయకులు.. జేజేలు కొట్టేవారు.. జెండాలు మోసేవారు. అహో కేసీఆర్.. జయహో కేటీఆర్ .. అంటూ నినదించేవారు.. ఇలా నిత్య సంక్రాంతికి చిరునామాగా మారిన తెలంగాణ భవన్.. ఇప్పుడు బోసి పోతోంది. తాజాగా ఇక్కడ సిబ్బంది.. ఇతర ఒకరిద్దరు నాయకులు తప్ప ఎవరూ కనిపించలేదు. సెక్యూరిటీ మాత్రం ఉంది. కానీ, వచ్చేవారు లేక వారు కూడా గేట్లు బార్లా తీసిపెడుతున్నారు.
నిజానికి తెలంగాణ భవన్.. అంటే బీఆర్ఎస్ నాయకులకు సమస్యల పరిష్కార వేదిక. ఏ సమస్య ఉన్నా.. ఇక్కడకు వచ్చేవారు పరిష్కరించుకునేవారు. అంతేకాదు..పదవులు ఇవ్వాలన్నా.. పరిష్కారాలు చేయాలన్నా.. ఇదే భవనం వేదిక. అలాంటి భవనం.. గురించి ఒక సందర్భంలో అప్పటి సీఎం కేసీఆర్ మాట్లా డుతూ.. ``మన తెలంగాణ భవన్ చూసిన గాంధీ భవన్ సిగ్గు పడుతోంది. అక్కడ దోమలు తోలుకొనుడు తప్ప.. ఇంకేం లేదు. మన తెలంగాణ భవన్‌లో నిత్య సంక్రాంతి. వచ్చెటోళ్లు.. పోయెటోళ్లను చూసి కాంగ్రెసోళ్లు కుళ్లు కుంటున్నరు`` అని వ్యాఖ్యానించారు.
నిజమే.. 15 మాసాల కిందటి వరకు తెలంగాణ భవన్.. నిత్యం సంక్రాంతి.. నిత్య బోనాల జాతరను తలపిం చింది. కానీ, ఒకే ఒక్క ఓటమి.. తెలంగాణ భవన్‌ను కేసీఆర్ చెప్పినట్టు గాంధీభవన్ మాదిరిగా సిగ్గు పడేలా చేస్తోంది. వచ్చేవారు లేరు. వచ్చినా.. జేజేలు లేవు. సంబురాలు అంతకన్నా లేవు. కేటీఆర్, హరీష్ రావులు కూడా రాక తగ్గించేసరికి.. కీలక నాయకులు ఎవరూ కూడా కనిపించడం లేదు. దీనికితోడు ఒకప్పుడు జిల్లాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున తమ మందీ మార్బలంతో వచ్చి.. పార్టీల్లో చేరేవారు. ఇప్పుడు ఆ ఛాయలే లేకపోవడం గమనార్హం.
ఎలా చూసుకున్నా.. ఇప్పుడు తెలంగాణ భవన్.. బోసిపోతోంది. నిజానికి ఏ పార్టీకైనా గెలుపు ఓటములు కామన్. ప్రజాభీష్టాన్ని గౌరవించాల్సిందే. ఈ నేపథ్యాన్ని గుర్తిస్తే.. తెలంగాణ భవన్ ఇంతగా బోసిపోయేది కాదు. నాయకులు రావడం.. మీడియా మీటింగులు పెట్టడం.. వెళ్లిపోవడం వరకే పరిమితం అవుతున్నారు. ఏ కార్యక్రమం అయినా..ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లేదా.. కేసీఆర్ నివాసం అన్నట్టుగా మారిన దరిమిలా.. నాయకులు, కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్‌వైపు చూడడం లేదు.