యువ వికాసం కాదు.. యువ విలాపం.. కేటీఆర్ కీలక ట్వీట్

ఏడాది కాలంగా బీఆర్ఎస్ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నదని, ఎన్నో సవాళ్లను సైతం ఎదుర్కొన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాదిపాటు పార్టీకి చాలా కష్టంగా గడిచిందని తెలిపారు.

Update: 2024-12-04 06:36 GMT

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది పూర్తయింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు.

ఏడాది కాలంగా బీఆర్ఎస్ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నదని, ఎన్నో సవాళ్లను సైతం ఎదుర్కొన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాదిపాటు పార్టీకి చాలా కష్టంగా గడిచిందని తెలిపారు. ఎంత గట్టిగా దెబ్బకొట్టారన్నది కాకుండా.. ఎంత గట్టి దెబ్బ తగిలినా పోరాటం కొనసాగించడమే ముఖ్యం అంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడి పోరాడుతున్నామని, కేసీఆర్ నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు ఆయన థాంక్యూ చెప్పారు. మరో నాలుగేళ్లు ఇంకా మిగిలి ఉందంటూ పేర్కొన్నారు.

అలాగే.. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో యువ వికాసం కాలేదని, యువ విలాపమే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక యువతను నిలువునా మోసం చేసిందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పబ్లిసిటీ చేసుకుంటున్నదని మండిపడ్డారు. 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయి మాటలు చెబుతున్నదని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసినవి కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. యువతను మోసగిస్తే కాంగ్రెస్ పని అధోగతి పాలు కావాల్సిందేనని హెచ్చరించారు.

మరోవైపు.. జాబ్ క్యాలెండర్ అని చెప్పి దాని జాడ లేకుండా పోయిందని కేటీఆర్ విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. ఏడాది కాలం పూర్తి అవుతున్నా ఇప్పటివరకు 12,527 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, ఇంకా 1,87,473 ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు బాకీ పడిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే కాలం వెళ్లదీస్తున్నదని, నిజం నిప్పులాంటిదని, కాంగ్రెస్ మోసాలకు తెలంగాణ సమాజం గట్టిగానే జవాబు చెబుతుందని మండిపడ్డారు. జాగో తెలంగాణ యువత అంటూ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News