కూతురు-కుటుంబ పాలన.. కొంప ముంచాయా? బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి?
ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని అనుకున్నా.. ప్రధానంగా సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సహా.. కుటుంబ పాలన అనే వాదన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోయింది. తెలంగాణ కోసం ఉద్యమించామని.. ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యామని పదే పదే చెప్పుకొన్న బీఆర్ ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వేసిన పాచికలు పారలేదు. అయితే.. ఆయనపై వ్యతిరేకత ఉందా.. లేక లోకల్ నాయకత్వంపై వ్యతిరేకత ఉందా? అనే విషయాలను పక్కన పెడితే.. కీలకమైన విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.
ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని అనుకున్నా.. ప్రధానంగా సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సహా.. కుటుంబ పాలన అనే వాదన.. ఈ రెండు కూడా తెలంగాణ సమాజంపై ప్రభావం చూపించాయని అంటున్నారు. నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో ఉద్యమించిన తెలంగాణ పౌరులు.. కొత్త రాష్ట్రాన్ని సాధించుకన్నా.. ఈ మూడు అంశాల విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారనేది వాస్తవం.
నీళ్ల విషయం అలా ఉంచితే.. నిధులు, నియామకాల విషయంలో కేసీఆర్ తన కుటుంబానికే లబ్ధి చేకూర్చుకుంటున్నారన్న విపక్షాల వాదనకే ప్రజలు జైకొట్టారు. నిధులు తన ఫామ్ హౌస్‌కి, తన ఇంటికి, నియామకాలను తన కుటుంబానికే కేసీఆర్ పరిమితం చేశారని.. కాంగ్రెస్ నేతలు విస్తృతం గా ప్రచారం చేశారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలోనూ నియామకాలపై యువత ఆగ్రహంతో ఉన్నారు. నిధుల విషయంలోనూ క్షేత్రస్థాయి పరిస్థితి అలానే ఉంది.
ఈ రెండు పరిణామాలకు తోడు.. కుమార్తె కవిత చుట్టూ తిరిగిన లిక్కర్ స్కామ్. అదేవిధంగా మునుగోడు ఉప పోరుకు ముందు వెలుగు చూసిన.. ఫామ్ హౌస్ నోట్ల కట్టల వివాదం రెండూ కూడా.. బీఆర్ ఎస్‌ను ఇరకాటంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా కవిత చుట్టూ తిరిగిన లిక్కర్ స్కామ్‌లో దాదాపు వందల కోట్లు ఆమె దోచుకున్నారని.. కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో చర్చకు వచ్చింది. అందుకే.. ఈ దఫా ఎన్నికల ప్రచారంలో ఆమెను ప్రధాన ప్రచార కర్తగా కాకుండా.. సాధారణ కార్యకర్తగానే ఉంచేశారు. అయినప్పటికీ.. ఎన్నికలపై ఆమె ప్రభావం పడిందనేది పరిశీలకులుచెబుతున్న మాట.