బోనాల ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో మిస్..అనుచరుల వీరంగం ఇంతనా?
బోనాల సందర్భంగా ఆ హడావుడి
హైదరాబాద్ మహానగరంలో ఎప్పుడూ లేని కొత్త సిత్రాలు ఈ మధ్యన చేసుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్ కు చెందిన కొందరు ప్రజాప్రతినిధుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ఆదివారం జరిగిన హైదరాబాద్ బోనాల సందర్భంగా అలాంటి సీన్ ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ లో గడిచిన కొద్దికాలంగా మొదలైన ట్రెండ్ చూస్తే.. కార్యక్రమం ఏదైనా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం అనవాయితీగా మారింది.
అందునా ఎన్నికల సంవత్సరం.. మరో మూడు.. నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతి కార్యక్రమాన్ని సందడిగా చేయటం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. ఇందులో భాగంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడుతూ.. తమకున్న పరపతి ఎంతన్న విషయాన్ని అందరికి చాటే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలాంటి వేళ.. బోనాల సందర్భంగా ఆ హడావుడి ఎంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోనాల వేళ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీలో.. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఫోటో లేకపోవటంపై బీఆర్ఎస్ క్యాడర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
సదరు వ్యక్తి ఇంటిపై దాడి చేసే వరకు విషయం వెళ్లటం షాకింగ్ గా మారింది. వెంగళరావు నగర్ కు చెందిన గణేశ్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద బోనాల సందర్భంగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో స్థానిక ఎమ్మెల్యే మాగంటి ఫోటో లేదు. దీనిపై గోపీనాథ్ అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. మూకుమ్మడిగా వచ్చి అతనిపై దాడి చేయటం సంచలనంగా మారింది.
అయితే.. ఇదంతా కేవలం ఫ్లెక్సీ విషయంలో జరిగిందా? లేదంటే ఏదైనా ఇతర కారణాలు ఉంటే.. బోనాల వేళ.. ఫ్లెక్సీ పేరుతో ఈ రచ్చ చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. ఎన్నికల వేళ.. ఎమ్మెల్యే బ్యాచ్ వీరంగం సానుకూలత కంటే ప్రతికూలతగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
ఇలాంటి కల్చర్ ను హైదరాబాద్ మహానగర ప్రజలు అస్సలు ఇష్టపడరంటున్నారు. అయితే.. ఈ దాడిలో బాధితుడిగా మారిన వ్యక్తి ఇప్పటివరకు బయటకు వచ్చి అసలేం జరిగిందన్న విషయంపై మాట్లాడకపోవటం గమనార్హం.