అభ్యర్ధుల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా ?

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న సమయంలో బీఆర్ఎస్ అభ్యర్ధుల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్లుంది

Update: 2023-11-27 01:30 GMT

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న సమయంలో బీఆర్ఎస్ అభ్యర్ధుల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే ప్రచారంలో తమను అడ్డుకుంటున్న జనాలతో పాటు సొంతపార్టీ నేతలపైన కూడా ఎంఎల్ఏలు, అభ్యర్ధులు విరుచుకుపడుతున్నారు. గడచిన వారంరోజులుగా అభ్యర్ధుల ధోరణి పెరిగిపోతోంది. జనాలు నిలదీయటం, అభ్యర్ధులు వాళ్ళపై తిట్లు మొదలుపెట్టడం చాలా సహజమైపోయింది. ఇలాంటి దృశ్యాలు దేనికి సంకేతాలనే చర్చ జనాల్లో బాగా పెరిగిపోతోంది. తాజాగా కూడా ఇలాంటి ఘటనలే ఎంఎల్ఏలకు ఎదురయ్యాయి.

అచ్చంపేట ఎంఎల్ఏ గువ్వల బాలరాజు, ముథోల్ ఎంఎల్ఏ విఠల్ రెడ్డి, జనగామ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారాన్ని జనాలు అడ్డుకున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయలేని వాడివి ఎందుకు దత్తత తీసుకున్నావని గ్రామస్తులు ముథోల్ ఎంఎల్ఏ విఠల్ రెడ్డిని గట్టిగా తగులుకున్నారు. నియోజకవర్గంలో ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా ఎంఎల్ఏని జనాలు ఇలాగే తగులుకుంటున్నారు. దాంతో ఏమిచేయాలో అర్ధంకాని విఠల్ జనాలపై విరుచుకుపడుతున్నారు. అలాగే జనగామ నియోజకవర్గం రాబర్తి గ్రామంలో పల్లా ప్రచారాన్ని జనాలు అడ్డుకున్నారు.

దళితబంధు పథకాన్ని ఇప్పిస్తానని నేతలు కొందరు రు. 20 లక్షలు వసూలు చేసినట్లు మండిపడ్డారు. రావాల్సిన పథకం రాకపోగా చేతినుండే లక్షల రూపాయలు పోయాయని మండిపోయారు. ఈ విషయాన్ని చెప్పినా ఇంతకాలం పట్టించుకోకుండా ఇపుడు ఓట్లకోసం ఎదుకొచ్చావంటు నిలదీశారు. పథకం లబ్దిలో అనర్హులే ఎక్కువమంది ఉన్నారని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని మండిపోయారు. అధికారంలో ఉన్నంత కాలం జనాల సమస్యలను, పథకాల అమలును పట్టించుకోకుండా ఇపుడు ఎన్నికల ముందు జనాల్లోకి ఎందుకొచ్చావని వాయించిపడేశారు.

అలాగే అచ్చంపేట నియోజకవర్గం సమస్యలపై నిలదీసినందుకు జనాలపై ఎంఎల్ఏ గువ్వల విరుచుకుపడ్డారు. సమస్యలపై ప్రశ్నించి ప్రచారాన్ని అడ్డుకున్నందుకే జనాలపై గువ్వల బూతుపురాణం వినిపించారు. తనను ప్రశ్నించిన వారిని, సమస్యలు ప్రస్తావించిన వాళ్ళపై గువ్వల ఎదురుదాడి చేసి బూతులు తిట్టడమే ఆశ్చర్యంగా ఉంది. గువ్వల వ్యవహారం చూస్తుంటే ఓటమి తాలూకు ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతున్నట్లు అనుమానంగా ఉంది. ఓటమి భయం పెరగకపోతే ఎంఎల్ఏ అభ్యర్ధులు ఇంత కోపంగా రియాక్టవ్వరని అందరికీ తెలిసిందే. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News