బీఆర్ఎస్‌లో భయాందోళన.. టికెట్ తీసుకునేవారేరీ?
రోజురోజుకూ పార్టీని వీడుతున్న వారు మాత్రం పెరిగారు. సిట్టింగ్ ఎంపీల్లో ఓడిపోతామనే భయం, కిందిస్థాయిలో కాంగ్రెస్ జోష్ కనబడుతుండటంతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొన్నది.
తెలంగాణను నిన్న మొన్నటి వరకు శాసించిన బీఆర్ ఎస్ పార్టీ.. ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. రోజురోజుకూ పార్టీని వీడుతున్న వారు మాత్రం పెరిగారు. సిట్టింగ్ ఎంపీల్లో ఓడిపోతామనే భయం, కిందిస్థాయిలో కాంగ్రెస్ జోష్ కనబడుతుండటంతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొన్నది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణ భవన్‌లో సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నా నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపలేక పోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత గులాబీ దళంలో ఓటమి భయం పుట్టిందా? అంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అవుననే చెప్పాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఊహించని ఓటమి నుంచి బీఆర్ఎస్ నేతలు ఇంకా తేరుకోలేదు. అందుకేనేమో కొందరు నేతలు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు. మరికొందరు చివరి క్షణంలో తాను పోటీ చేయనని వెల్లడిస్తున్నారు. దానికి తోడుగా పార్టీ వీడుతున్న నేతల సంఖ్య కూడా రోజురోజుకు అధికం అవుతోంది.
ఇటీవలి వరకూ నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరిన శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ఇప్పుడు పోటీకి నో అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన కేసీఆర్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్‌రెడ్డికి మరోసారి టిక్కెట్ ఇస్తున్నామంటూ మొదట్లోనే గులాబీ పార్టీ ప్రకటించింది. అయితే మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరటంతో చేవెళ్లలో రాజకీయ సమీకరణాలు మారాయి.
దీంతో తాను చేవెళ్ల నుంచి పోటీ చేయలేనంటూ రంజిత్, కేసీఆర్‌కు తెలిపినట్టు సమాచారం. దుండిగల్ లో భవనాల కూల్చివేత నేపథ్యంలో మల్కాజ్‌గిరి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుమారుడు డాక్టర్ భద్రారెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు ఇప్పుడు ఖర్చు భరించటం కష్టంమని వాపోతున్నారు. ఇదే పరిస్థితి సికింద్రాబాద్‌లోనూ కనిపిస్తోంది.
అక్కడి నుంచి బీఆర్‌ఎస్ టిక్కెట్ కోసం ఎదురు చూసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయికిరణ్… ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. తనకు అత్యంత దగ్గరగా ఉండే ముఖ్యులను ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయాలని కేసీఆర్ అడుగుతున్నారు. నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వరంగల్ నుంచి ఎర్రోళ్ల శ్రీనివాస్ లేదా గ్యాదరి బాలమల్లు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ లేదా కాసాని వీరేశ్‌లను పోటీకి కేసీఆర్ ఒప్పించినట్టు తెలుస్తోంది.