పార్టీ మారినా పరేషాన్ తప్పడంలే?

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆపరేషన్ ఆకర్ష్ కింద కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నది

Update: 2024-07-09 05:38 GMT

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆపరేషన్ ఆకర్ష్ కింద కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ మొదలుపెట్టిన ఈ చేరికల పర్వం ముగియాలంటే బీఆర్ఎస్ లో ఉన్న 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఇప్పటికి ఏడుగురు ఎమ్మెల్యేలు. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు గోడ దూకారు.

అయితే పార్టీ మారినా పరేషాన్ తప్పడం లేదని, అధికార పార్టీలో చేరిన సుఖం దక్కడం లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సన్నిహితులతో వాపోతున్నట్లు తెలుస్తుంది. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మూడో వంతు అంటే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయినట్లు లెక్క.

కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ లు బీఆర్ఎస్ లో చేరారు. కడియం తన కూతురిని వరంగల్ ఎంపీగా గెలిపించుకోగా, దానం సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికల తర్వాత శ్రీహరి, దానంలు సైలెంట్ అయిపోగా, మిగిలిన 5 గురు ఎమ్మెల్యేలు ఎక్కడా నోరు మెదపడం లేదు.

26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితేనే తమ మీద అనర్హత వేటు పడకుండా ఉంటుందని, ఆ లోపు ఎక్కడ ఏం మాట్లాడినా అనర్హత వేటు, కోర్టు విచారణలు ఎదుర్కోక తప్పదన్న భయం వారిలో నెలకొంది, ఇప్పటికే వీరి మీద అనర్హత వేటు కోసం స్పీకర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా, కోర్టులో పిటీషన్లు కూడా వేయడం జరిగింది. దీంతో ఎక్కడ నోరు తెరిచి ఏం మాట్లాడినా అవి కోర్టు ముందు సాక్ష్యాలుగా నిలుస్తాయన్న భయం వారిలో ఉంది. అందుకే వారు నోరు మెదపడం లేదని చెబుతున్నారు.

Tags:    

Similar News