మేడిగడ్డలో ఏమి పరిశీలిస్తారు ?
మేడిగడ్డ బ్యారేజీకి వెళ్ళేటపుడు అవసరమైన సెక్యూరిటి ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ తరపున ఒక బృందం డీజీపీ రవిగుప్తాను కలిసి విజ్ఞప్తి అందించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీయార్ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. మార్చి 1న ఛలో మేడిగడ్డ బ్యారేజి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఇరిగేషన్ రంగంలోని నిపుణులతో కలిసి బ్యారేజిని పరిశీలించబోతున్నట్లు నల్గొండ బహిరంగసభలో కేసీయార్ ప్రకటించారు. తర్వాత మార్చి 1న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించబోతున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ చెప్పారు. తాము మేడిగడ్డ బ్యారేజీకి వెళ్ళేటపుడు అవసరమైన సెక్యూరిటి ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ తరపున ఒక బృందం డీజీపీ రవిగుప్తాను కలిసి విజ్ఞప్తి అందించారు.
పరిశీలనకు అవసరమైన రూటుమ్యాపును కూడా బీఆర్ఎస్ బృందం డీజీపీకి అందించింది. వారి విజ్ఞప్తి ప్రకారం ఉప్పల్, ఘట్ కేశర్, భువనగిరి, ఆలేరు, జనగామ్, వరంగల్, పరకాల, భూపాలపల్లి మీదుగా మేడిగడ్డకు చేరకుంటుంది. అంతా బాగానే ఉంది కాని అసలు ప్రభుత్వం బ్యారేజి సందర్శనకు అనుమతి ఇస్తుందా అన్నదే అనుమానంగా ఉంది. ఎందుకంటే బ్యారేజిని పరిశీలించేందుకు ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తే అప్పటి కేసీయార్ ప్రభుత్వం అడ్డుకున్నది. బ్యారేజి దగ్గరకు వెళ్ళేందుకు అనుమతిలేదని అభ్యంతరం చెప్పింది.
ఇదే విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతు అసలు బ్యారేజి దగ్గరకు వెళ్ళి బీఆర్ఎస్ బృందం ఏమి పరిశీలిస్తుందని నిలదీశారు. కేసీయార్ హయాంలో, పర్యవేక్షణలో నిర్మించిన బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీని ఫలితంగా బ్యారేజీ ప్లాట్ ఫారంతో పాటు గోడలకు కూడా పగుళ్ళు వచ్చినంది నిజంకాదా అని నిలదీశారు. కేసీయార్ హయాంలో నిర్మించిన నాసిరకం నిర్మాణం ఇపుడు పనికిరాకుండా పోతోందన్న విషయం జనాలందరికీ అర్ధమైందన్నారు.
అవినీతికి పాల్పడిన కారణంగానే మేడిగడ్డ బ్యారేజికి ఈ పరిస్తితి దాపురించిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. కేసీయార్ హయాంలో నిర్మించిన బ్యారేజీ నాసిరకం నిర్మాణం కారణంగా దెబ్బతింటే బాధ్యత ఎవరు వహించాలని అడిగారు. ప్రభుత్వం వైఖరి చూస్తుంటే కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారాలపై వెంటనే నిపుణులతో అధ్యయనం చేయించి పూర్తిస్ధాయిలో విచారణ జరిపించేట్లే ఉంది. అందుకనే బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.