చేరికలపై ఆ ఇద్దరికి మాత్రమే ఆసక్తా? తెరపైకి కొత్త ఇష్యూ?
గులాబీ కారును ఖాళీ చేయటమే లక్ష్యంగా కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఆపరేషన్ ఒక కొలిక్కి రావటం తెలిసిందే
గులాబీ కారును ఖాళీ చేయటమే లక్ష్యంగా కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఆపరేషన్ ఒక కొలిక్కి రావటం తెలిసిందే. టార్గెట్ ప్రకారం చూసుకుంటే దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు గులాబీ కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలి. అప్పుడు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లోకి విలీనం అయ్యే ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్న గులాబీ ఎమ్మెల్యేలను చూస్తే.. విలీన లక్ష్యానికి చేరుకోవాలంటే ఆపరేషన్ ను మరింత వడివడిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇంతకాలం జిల్లాల మీద ఫోకస్ చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం.. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకొని పావుల్ని కదుపుతోంది. ఎన్నికల వేళ దానంనాగేందర్ ను పార్టీలోకి తెచ్చిన కాంగ్రెస్.. గడిచిన రెండు రోజులుగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పార్టీలోచేర్చుకున్నారు. ఇప్పుడు పటాన్ చెర్వు ఎమ్మెల్యే వంతు వచ్చిందని చెబుతున్నారు. మరికొందరు క్యూలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఓవైపు జోరుగా పార్టీలో చేరికలు జరుగుతున్నట్లుగా సీన్ కనిపించినా.. కాంగ్రెస్ లోని పలువురు మాత్రం ఈ చేరికల మీద ఏ మాత్రం ఆసక్తిగా లేరని చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీలో చేరే అవకాశం ఉన్న కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు.. గులాబీ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడేలా చేస్తుందని చెబుతున్నారు. తాము చేయటానికే ఏమీ లేదని.. అలాంటిది పార్టీ మారి మరీ వచ్చే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదన్న పెదవి విరుపు కాంగ్రెస్ మంత్రులు.. ఎమ్మెల్యేల నుంచి రావటం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త అనుభవంగా మారినట్లు చెబుతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన మంత్రులు ఇద్దరికి తప్పించి మిగిలిన వారంతా చేరికల మీద ఆసక్తిగా లేరన్న మాట బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటే.. రేవంత్ మరింత స్ట్రాంగ్ అవుతారని.. అదే జరిగితే తమ ఆటలు సాగవన్న ఆలోచనలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. విలీన ఆపరేషన్ ఒకవైపు జోరుగా సాగుతున్న వేళ.. గుట్టుచప్పుడు కాకుండా కొందరు జరుపుతున్న రివర్సు ఆపరేషన్ మీద రేవంత్ అండ్ కో అవగాహనతో ఉన్నారా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.