టీటీడీపీ పగ్గాలు... టీటీడీ బోర్డులో చోటు కావాలి.. చంద్రబాబుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆఫర్

తెలంగాణలో ప్రస్తుతం జంపింగ్ రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ లో చేరిపోయారు

Update: 2024-07-08 11:26 GMT

తెలంగాణలో ప్రస్తుతం జంపింగ్ రాజకీయం నడుస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీని పటిష్ఠం చేస్తామంటూ ఏపీ సీఎం, టీడీపీ అధినేత ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ తో సమావేశం అయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన తమ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను సందర్శించారు. కార్యకర్తల అపూర్వ ఆదరణ నడుమ తెలంగాణలో టీడీపీ ఉంటుందనే సంకేతాలిచ్చారు.

కాంగ్రెస్ కాదు టీడీపీ

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు సాగుతున్నాయి. అయితే, ఓ ఎమ్మెల్యే గతంలో ఇలానే చేరేందుకు ప్రయత్నించి వెనక్కు వచ్చారు. ఈయనకు టీడీపీ నేపథ్యం ఉంది. రెండుసార్లు ఆ పార్టీ తరపునే గెలిచారు. మరో రెండుసార్లుగా బీఆర్ఎస్ నుంచి నెగ్గారు. అయితే, మారిన రాజకీయ పరిణామాల రీత్యా కాంగ్రెస్ లో తన సమకాలీనుడు రేవంత్ రెడ్డి సీఎం అవడంతో ఆ పార్టీ వైపు వెళ్లాలని చూశారు. మరి ఇంతలో ఏమైందో ఏమో అనూహ్యంగా వెనక్కుతగ్గారు. నియోజకవర్గ కార్యకర్తల అభిప్రాయంతోనే తన నిర్ణయం మార్చుకున్నట్లు చెప్పారు. అయితే, ఇప్పుడు ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు.

రెండు డిమాండ్లు

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో తెలంగాణలోని ఆ ఎమ్మెల్యే మనసు మారిందని చెబుతున్నారు. టీడీపీకి తెలంగాణలో, అందులోనూ హైదరాబాద్ లో మంచి ఆదరణ ఉంటుందని భావిస్తూ ఆ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా చంద్రబాబుకే ఆయన డిమాండ్లు విధించారు. తనకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని, టీటీడీ బోర్డులో చోటు కల్పించాలని కోరారట. అయితే, ఇదంతా నేరుగా ప్రతిపాదన చేశారా? అనేది మాత్రం తెలియరాలేదు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కాసాని టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడంతో ఆయన రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.

Tags:    

Similar News