కామారెడ్డిలో ఓవర్ యాక్షన్ బయటపడిందా ?

రాబోయే ఎన్నికల్లో కేసీయార్ రెండు నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్న విషయం తెలిసిందే.

Update: 2023-09-05 04:38 GMT

రాబోయే ఎన్నికల్లో కేసీయార్ రెండు నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. గజ్వేల్ తో పాటు అదనంగా కామారెడ్డిలో కూడా పోటీకి కేసీయార్ రెడీ అయ్యారు. రెండు నియోజకవర్గాల్లో పోటీచేయటంపై అనేక విమర్శలు, ప్రతివిమర్శలు మోతెక్కిపోతున్నాయి. వీటిని పక్కనపెట్టేస్తే ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే కామారెడ్డిలోని కొన్ని గ్రామపంచాయితీలు కేసీయార్ పోటీచేయటాన్ని అభినందిస్తు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. దానిపై కాంగ్రెస్ ఇపుడు పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది.

అభ్యంతరాలు వ్యక్తంచేయటమే కాకుండా కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు కూడా చేసింది. ఈ మొత్తం ఓవర్ యాక్షన్ కు ప్రధాన కారణం ఎంఎల్సీ, కేసీయార్ కూతురు కల్వకుంట్ల కవిత మాత్రమే అనే ప్రచారం మొదలైంది. కేసీయార్ కామారెడ్డిలో కూడా పోటీచేయబోతున్నట్లు ప్రకటించిన దగ్గర నుండి కవిత అక్కడే మకాం వేశారు. మొత్తం నియోజకవర్గాన్ని తన చేతిలోకి తీసేసుకున్నారు. మండలాల్లోని నేతలందరినీ పిలిపించి కేసీయార్ కు మద్దతు ప్రకటనలు ఇప్పిస్తున్నారు. అలాగే ఇతరపార్టీల్లోని నేతలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తొమ్మిది గ్రామ పంచాతీలు కేసీయార్ పోటీని అభినందిస్తు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఇక్కడే కవిత ఓవర్ యాక్షన్ బయటపడింది. ఎలాగంటే కేసీయార్ పోటీని అభినందించిన పంచాయితీల్లో వార్డు మెంబర్లుగా కాంగ్రెస్ నేతలున్నారట. వాళ్ళు సంతకాలు చేయటానికి వ్యతిరేకించినా వినకుండా వాళ్ళతో సంతకాలు చేయించి ఏకగ్రీవ తీర్మానంటు కవిత ఓవర్ యాక్షన్ చేయించారని ఇపుడు బయటపడింది.

అదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు బాహాటంగా చెబుతున్నారు. దాంతో విషయం రచ్చకెక్కి కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది. నిజానికి కేసీయార్ పోటీని ఆహ్వానిస్తు, అభినందిస్తు తీర్మానాలు చేస్తే చేయచ్చు. అంతేకానీ ఏకగ్రీవ తీర్మానాలని, అభ్యంతరాలు చెప్పిన వాళ్ళని ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించటం ఏమిటో అర్ధంకావటంలేదు. అసలు పంచాయితీలు ఏకగ్రీవం చేస్తే ఏమిటి ? చేయకపోతే ఏమిటి ? వీటితో కీసీయార్ కు వచ్చే అదనపు ఉపయోగం ఏమిటో కవితకే తెలియాలి.

Tags:    

Similar News