సారు.. కారు.. పదమూడే..? 20 ఏళ్లలో 4 చోట్ల బోణీ కొట్టలే
పదేళ్లు పోరాటాలు చేసి.. ఆపై పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఓ నాలుగు నియోజకవర్గాలు మాత్రం కొరుకుడు పడడం లేదు.
పదేళ్లు పోరాటాలు చేసి.. ఆపై పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీకి ఓ నాలుగు నియోజకవర్గాలు మాత్రం కొరుకుడు పడడం లేదు. ఎంత ప్రయత్నించినా విజయం మాత్రం అందని ద్రాక్షే అవుతోంది. గెలుపు చేతిదాకా వచ్చి చేజారుతోంది. పోనీ, అవేమైనా దూర ప్రాంతాల్లో ఉన్నాయా? లేక పార్టీ లక్ష్యానికి అక్కడ ఆదరణ లేదా? అంటే.. అదేమీ కాదు. అన్నీ ఉన్నా.. విజయానికి అవసరమైనదేదో కొరవడడమే దీనికి కారణం.
ఈసారైనా ఖాతా తెరుస్తుందా..?
తెలంగాణ సాధనే లక్ష్యంగా 2001లో ఏర్పడిన టీఆర్ఎస్ 2014 నాటికే తన లక్ష్యాన్ని అందుకుంది. ఈ మధ్యలో 2004, 2009 లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొంది. తొలిసారి కాంగ్రెస్ తో, మలిసారి మహా కూటమి (టీడీపీ, వామపక్షాలు)తో వెళ్లింది. 2014 నాటికి తెలంగాణ ఏర్పాటు ఖాయమైన పరిస్థితుల్లో ఒంటరిగానే బరిలో దిగింది. ఇక 2019 ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు అంటూ పిలుపునిచ్చి 9 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3 సీట్లు రావడంతో బీఆర్ఎస్ దే పైచేయి అయింది.
సారు.. కారులో ఈ నాలుగు లేవు..
2004 నుంచి లోక్ సభ ఎన్నికల్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నల్లగొండ నియోజకవర్గాల్లో ఇంతవరకు గెలవలేదు. హైదరాబాద్ అంటే మజ్లిస్ పార్టీ అడ్డా. మిగతా ఏ పార్టీ అయినా అక్కడ పోటీ మాత్రమే చేస్తుంది. గెలవదు. ఇక సికింద్రాబాద్ లో మాత్రం అన్ని పార్టీలకూ చాన్స్ ఉంటుంది.
ఉద్యమాల గడ్డలోనూ..
నల్లగొండ అంటే ఉద్యమాల గడ్డ. తెలంగాణవాదానికి బలమైన అండగా నిలిచింది. కానీ, ఈ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ఇంతవరకు నెగ్గలేదు. మిగిలింది, నాలుగో స్థానం మల్కాజిగిరి. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. ఇక్కడ గత మూడు ఎన్నికలూ బీఆర్ఎస్ కు ఓటమినే మిగిల్చాయి. ప్రస్తుత ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ ఈ నాలుగు (కచ్చితంగా చెప్పాలంటే మూడే) స్థానాల్లో ఒక్కటైనా నెగ్గుతుందా? లేదా? చూడాలి.
కొసమెరుపు: తెలంగాణవాదం అంత బలంగా లేని, ఏనాడూ నేరుగా ఒక్క ఎమ్మెల్యేకు మించి గెలవని ఖమ్మంలోనూ 2019లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అలాంటిది హైదరాబాద్ నడిబొడ్డున ఉండే సికింద్రాబాద్, మల్కాజిగిరిలో మాత్రం ఓడిపోతోంది. నల్లగొండ లాంటి తెలంగాణ వాదం ఉన్నచోటా గెలవలేకపోవడం విచిత్రం.