మ‌నోడే అయినా.. 'మాకేంటి?'!!

ఒక‌ట‌నే కాదు.. దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ పార్టీకి సొంత కార్య‌క‌ర్త‌లు, నేత‌లే సెగ పెడుతున్నారు. "మాకేంటి?" అంటూ.. చేతులు జాపుతున్నారు.

Update: 2023-11-07 06:42 GMT

నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీ జెండా మోశారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు గుప్పించారు. జై తెలంగాణ అని గొంతు చించుకున్నారు. ఇంకేముంది.. అంద‌రూ మ‌నోళ్లే.. ఏసేయండ్రా కండువా అంటూ.. అంద‌రి నీ చేర్చేసుకున్నారు. ఎన్నిక‌ల్లో వీరావేశం ప్ర‌ద‌ర్శిస్తార‌ని, ప్ర‌చారానికి ప‌నికి వ‌స్తార‌ని లెక్క‌లు కూడా వేసుకున్నారు. అయితే.. ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభ‌మైంది. నామినేష‌న్ల ఘ‌ట్టం కూడా తెర‌మీదికి వ‌చ్చింది. కానీ, ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.

పైగా.. గ్రూపులు క‌ట్టి అభ్య‌ర్థుల‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఇదీ.. ఇత‌మిత్థంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారం. ఒక‌ట‌నే కాదు.. దాదాపు 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ పార్టీకి సొంత కార్య‌క‌ర్త‌లు, నేత‌లే సెగ పెడుతున్నారు. "మాకేంటి?" అంటూ.. చేతులు జాపుతున్నారు. మ‌నీ ఇచ్చుకోవ‌డం.. ఓటు పుచ్చుకోవ‌డం అనే అల‌వాటుకు ప్ర‌జ‌ల‌నే కాదు.. నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా మ‌ప్పేసిన నేతాగ‌ణానికి కీల‌క స‌మ‌యంలో సెగ బాగానే త‌గులుతోంది.

ఉదాహ‌ర‌ణ‌కు.. ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో దానం నాగేంద‌ర్ పోటీ చేస్తున్నారు. ఈయ‌న బ‌ల‌మైన నాయ‌కుడే. పైగా కార్య‌క‌ర్త‌ల‌కు కూడా అందుబాటులోనే ఉంటున్నారు. కానీ, ఇక్క‌డ కార్య‌క‌ర్త‌లు మాత్రం త‌మ‌కేంటి? అంటూ.. సందేశాలు పంపిస్తున్నారు. దీంతో నేను చూసుకుంటాను.. ముందు రండి! అని దానం వ‌ర్త‌మానం పంపుతున్నారు. త‌ర్వాత‌.. కాదు ఇప్పుడే తేల్చాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు కార్య‌క‌ర్త‌లు.

ఇక‌, రాష్ట్రస్థాయి నేత వస్తున్నారన్నా, భారీగా ర్యాలీలు తీయాలన్నా నేతలు అదే స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ప్రజలను తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయడం, ఇంధనాన్ని సమకూర్చడం, ఒక్కొక్కరికి ఇంత అని డబ్బులు ముట్టజెప్పడం, మందు, భోజనం తప్పనిసరి చేస్తున్నారు. ఇలా చేస్తే.. త‌ప్ప నాయ‌కులకు మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు.

బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన కొందరు మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. బీఆర్ ఎస్‌ అభ్యర్థి తమను పట్టించుకోవడం లేదని, సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదనిఅన్నారు. అప్రమత్తమైన పార్టీ పెద్దలు వారితో చర్చలు జరిపి ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చి నిలుపుకొన్నారు.

ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఓ పార్టీలో రెండు వర్గాలు ఉండగా మరోవర్గానికి చెందిన వ్యక్తులకు ఎలాంటి ఆర్థిక భరోసా ఇప్పటి వరకు అందకపోవడంతో వీరు ప్రచారానికి దూరంగానే ఉన్నారు. వీరిని మచ్చిక చేసుకునేందుకు మ‌నీ తీయ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కీల‌క‌మైన కూక‌ట్‌ప‌ల్లి లోనూ బీఆర్ ఎస్‌కు ఇప్పుడు చిక్కులు త‌ప్ప‌డం లేదు. ఇది న‌గ‌రంలోనే ఉన్నా.. ఇక్క‌డి కార్య‌క‌ర్త‌లు ప‌నులు మానుకుని రావాలంటే.. మ‌నీ ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌నీ ఇచ్చి వారిని బుజ్జ‌గిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలానే చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News