చేవెళ్లలో బీఆర్ఎస్ ఆశ్చర్యకర ఎంపిక.. ఎంపీ అభ్యర్థిగా ఆయన?
చేవెళ్ల నుంచి ఈసారి అధికార కాంగ్రెస్ టికెట్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి దక్కనుందని చెబుతున్నారు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కీలక నియోజకవర్గమైన చేవెళ్ల ఎంపీ స్థానం 2009లో ఏర్పడింది. ఇక్కడినుంచి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మామ, కేంద్ర మాజీ మంత్రి దివంగత జైపాల్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆపై ఘనమైన రాజకీయ నేపథ్యం ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కింది. అయితే, గత ఎన్నికల్లో మాత్రం పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డికి చాన్సిచ్చింది. ఆయన తేలిగ్గానే గెలుపొందారు. ఇలా నియోజకవర్గంగా ఏర్పడిన అనంతరం జరిగిన మూడు ఎన్నికల్లోనూ కొత్త అభ్యర్థినే గెలిపిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది చేవెళ్ల.
ఈసారీ తెరపై కొత్తవారే..?
చేవెళ్ల నుంచి ఈసారి అధికార కాంగ్రెస్ టికెట్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి దక్కనుందని చెబుతున్నారు. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య అయిన ఈమె ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. మొన్నటివరకు బీఆర్ఎస్ లో ఉన్న సునీతా కు తొలి జాబితాలోనే టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరిగినా అదేమీ నిర్ధారణ కాలేదు. మలి జాబితాలో టికెట్ వస్తుందేమో చూడాలి. ఇక బీజేపీ మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఓడి కాంగ్రెస్ లో చేరి అనంతరం బీజేపీలోకి వచ్చిన విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తొలి జాబితాలోనే టికెట్ పొందడం గమనార్హం. ఓ విధంగా మూడు ప్రధాన పార్టీల్లో బీజేపీనే తొలుత అభ్యర్థిని ప్రకటించింది.
రంజిత్ రెడ్డి కాదా..?
బీఆర్ఎస్ వచ్చే లోక్ సభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మ, మహబూబాబాద్ లో సిటింగ్ లు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, కరీంనగర్ లో వినోద్ కుమార్, పెద్దపల్లిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో గెలిచిన 9 మందిలో ముగ్గురు సిటింగ్ లు వెళ్లిపోగా.. ఇద్దరు సిటింగ్ లకు మళ్లీ సీటిచ్చింది. మిగిలిన నలుగురిలో రంజిత్ రెడ్డి ఒకరు. అయితే, ఆయనకు తొలి విడతలో టికెట్ ఇవ్వలేదు. రంజిత్ రెడ్డినే పోటీకి దూరంగా ఉన్నారా..? లేదా కావాలనే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ప్రకటన ఆలస్యం చేసిందా? అనేది తెలియదు కానీ.. మొత్తానికి చేవెళ్ల ఎంపీ టికెట్ కేటాయింపు ఎవరికి అనేది తేల్చలేదు.
తెరపైకి కొత్తపేరు..
ఉమ్మడి రాష్ట్రం ఉండగానే రంగాడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన కాసాని జ్ఝానేశ్వర్ ముదిరాజ్ పేరు ప్రస్తుతం బీఆర్ఎస్ చేవెళ్ల టికెట్ కు వినిపిస్తోంది. వాస్తవానికి కాసాని అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. చివరకు బీఆర్ఎస్ లో చేరారు. ఇక ముదిరాజ్ సామాజిక వర్గంలో బలమైన నేత అయిన కాసానిని విస్మరించలేని పరిస్థితుల్లో చేవెళ్ల నుంచి పోటీకి దింపే ఆలోచనలో ఉందట బీఆర్ఎస్ అధిష్ఠానం. ఆర్థికంగా బలవంతుడైన కాసానికి బీసీ నేతగా, ముదిరాజ్ వర్గ పెద్దగా పేరుంది. ఈటల రాజేందర్ స్థాయి నాయకుడు వెళ్లిపోయిన తర్వాత బీఆర్ఎస్ విమర్శలు ఎదుర్కంది. ఆ లోటును కాసాని ద్వారా భర్తీ చేసుకుంటుందేమో చూడాలి.