బీఆర్ఎస్ శాండ్ విచ్ అయిందా ?
బీఆర్ఎస్ ఎలాంటి పార్టీ ఎలా అయిపోయింది మరి. బొత్తిగా పట్టింపు లేకుండా ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎలాంటి పార్టీ ఎలా అయిపోయింది మరి. బొత్తిగా పట్టింపు లేకుండా ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుని ఆ పార్టీ అభిప్రాయాలతో ప్రమేయం లేకుండానే
వేరే పార్టీలు నిర్ణయం చేస్తున్నారు. పైగా ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో కూడా చూసి మరీ వారే ఇచ్చేస్తున్నారు.
బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో చూస్తే ఇవి చాలా చేదు రోజులుగానే చెప్పాలని అంటున్నారు. ఒక వైపు కాంగ్రెస్ మరో వైపు బీజేపీ బీఆర్ఎస్ తో చెలగాటమాడుతున్నాయి. ఈ మధ్యన పడి సాండ్ విచ్ మాదిరిగా బీఆర్ఎస్ నలిగిపోతోంది.
బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తూ బీజేపీ నేతలు జోస్యం చెబుతూంటే లేదు బీజేపీలోనే బీఆర్ఎస్ విలీనం అని కాంగ్రెస్ నేతలు బల్ల గుద్దుతున్నారు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అంటే విలీనం అన్న మాటే. అంటే బీఆర్ఎస్ విలీనం తప్పదని రెండు జాతీయ పార్టీలు తేల్చేశాయన్న మాట.
బీఆర్ఎస్ అధినేత కేసీఅర్ ఇంటి నుంచి బయటకు రాకపోవడం, గత ఆరు నెలలుగా ఆయన కుమార్తె కవిత జైలులో ఉండడం, కేటీఆర్ హరీష్ రావులు పార్టీని ముందుకు నడిపించ లేకపోవడం బీఆర్ఎస్ నుంచి నేతలు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూడడంతో పాటు ఆ పార్టీకి ఉన్న అనివార్యతను పసిగట్టి లేదా ఊహించి ఈ విధంగా విలీనం ప్రస్తావనను తెర మీదకు తెస్తున్నారు అని అంటున్నారు.
కావాలని చేస్తున్నారా లేక వ్యూహాత్మకంగా చేస్తున్నారా లేక బీఆర్ఎస్ ని బదనాం చేయడం ద్వారా ఆ పార్టీ క్యాడర్ ని డీ మోరలైజ్ చేయడానికి చేస్తున్నారా అన్నది అయితే అర్థం కావడం లేదు కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ ల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరొకరు తెలంగాణాలో అధికారం చలాయిస్తున్నారు.
దాంతో ఈ రెండు బలమైన అధికార పార్టీలతో ఒకే సమయంలో పోరాడడం బీఆర్ఎస్ కి కత్తి మీద సాముగా మారుతోంది. వ్యూహాలు అన్నీ ఊటబావిలో ఊట ఎండిపోయిన చందాన ఆవిరి అయిన సందర్భంలో బీఆర్ఎస్ చాలా సార్లు చేష్టలుడిగి చూస్తోంది. నిజంగా బీఆర్ఎస్ విలీనం అంటూ గత కొన్నాళ్ళుగా అదే పనిగా ప్రచారం సాగుతున్నా ఆ పార్టీ ఏమీ చేయలేని పరిస్థితులలోకి నెట్టబడింది అంటే కనుక బీఆర్ఎస్ కచ్చితంగా సాండ్ విచ్ గానే మిగిలింది అని అంటున్నారు.
ఒకే రోజు రెండు జాతీయ పార్టీలు అందులో ఇద్దరు ప్రముఖ నేతలు బీఆర్ఎస్ విలీనం అంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. అదే సమయంలో క్యాడర్ లో సైతం కొత్త డౌట్లు తెచ్చి పెడుతున్నాయి. అదే విధంగా తెలంగాణా సమాజంలోనూ సరికొత్త చర్చకు కారణమవుతున్నాయి.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అన్నది ఎవరో కాదు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన టైం ప్లేస్ కనుక చూస్తే ఢిల్లీ నుంచే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మరొకరు బీజేపీకి చెందిన కీలక నేత కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ లో కలుస్తుందని తనదైన జోస్యం వదిలారు.
అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు బండి సంజయ్ కానీ బీఆర్ఎస్ ఎందుకు విలీనం అవుతుంది దానికి గల నేపధ్యాలు అనివార్యతలు కూడా చెబుతూ లాజిక్ కి అందేలాగానే కామెంట్స్ చేశారు. దాంతోనే తెలంగాణా ప్రజలలో సైతం కొత్త సందేహాలు పుట్టుకుని వస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరిని నమ్మాలి అన్నదే ప్రజలకు కలుగుతున్న ధర్మ సందేహం. నిప్పు లేనిదే పొగ రాదు అని అంటారు.
గత కొంతకాలంగా బీఆర్ఎస్ విలీనం మీద అదే పనిగా ప్రచారం సాగుతోంది అంటే ఏదో తెర వెనక జరుగుతోంది అని నమ్మీ వారూ ఎక్కువగానే ఉన్నారు. నిజంగా అదే జరుగుతుందా బీఆర్ఎస్ విలీనం తప్పదా అన్నదే ప్రజలకు పట్టుకున్న డౌట్. బీఆర్ఎస్ అయితే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తాం కానీ విలీనం ఎందుకు చేస్తామని అంటోంది. చూద్దాం మరి ఏమి జరుగుతుందో.