పేరు మారిస్తే గులాబీ పార్టీ జాతకం మారుతుందా...!?
రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఎపుడూ పెద్ద పీట వేస్తారు. ఏ పార్టీని చూసినా సెంటిమెంట్లను అనుసరిస్తారు
రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఎపుడూ పెద్ద పీట వేస్తారు. ఏ పార్టీని చూసినా సెంటిమెంట్లను అనుసరిస్తారు. ఇతర మతాలకు చెందిన వారు పార్టీలకు నాయకత్వం వహిస్తున్నా గెలుపు కోసం జాతకాలను నమ్ముతారు. పేరు అచ్చి రాలేదని, కాలం కలసి రాలేదని వాస్తు బాగాలేదని ఏవేవో నమ్ముతారు.
ప్రజలతో చేసేదే రాజకీయం. ప్రజలకు నచ్చిన వారికే పట్టం కడతారు. వారికే అందలం దక్కుతుంది. ఇది వాస్తవం అయితే నేల విడిచి సాము చేసిన చందంగా సెంటిమెంట్లు పట్టుకుని కూర్చుంటారు రాజకీయ నేతలు. కొన్ని సార్లు ఆ సెంటిమెంట్ల వల్ల మంచి ఫలితాలు వస్తే రావచ్చు. కానీ ఎపుడూ ప్రజలతో కనెక్షన్ మాత్రమే ఎవరికైనా అధికారం ఇస్తుంది.
ఇపుడు తెలంగాణాలో బీఆర్ ఎస్ ఓటమి పాలు అయింది. దానికి కారణాలు అందరికీ తెలుసు. పదేళ్ల పాలనలో అధినాయకత్వం అహంకార ధోరణి. అన్నింటా పెరిగిన కుటుంబ పెత్తనం, హద్దులు దాటిన అవినీతి వంటివెన్నో కారణాలు ఉన్నాయని అంటారు. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా అంతా అవినీతిమయం అన్నట్లుగా రాజ్యం సాగింది. దానికి విసిగిన జనాలు బీఆర్ ఎస్ ని ప్రతిపక్షానికి పరిమితం చేసారు.
అయితే ఓటమి పాలు అయి నాలుగు నెలలు గడచినా దాని మీద ఆత్మ విమర్శ అయితే చేసుకోవడం లేదు. పైగా ఏవో ఇతర కారణాలను చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినీఅత కేసీఆర్ అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ జస్ట్. 1.8 శాతం ఓట్ల శాతంతో ఓటమి పాలు అయ్యామని అన్నారు. తాము బలంగా ఉన్నామని చెప్పారు.
సరే క్యాడర్ కి ధీమా నింపడానికి ఈ మాటలు అన్నా వాస్తవాలు చూసుకోవాలి కదా సరైన సమీక్ష జరగాలి కదా అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక కీలక నేత మాట్లాడుతూ బీఆర్ఎస్ పేరు మార్పు ఉంటుందని అంటున్నారు. అంటే పూర్వ నామధేయం అయిన టీఆర్ఎస్ గా మళ్లీ మార్చుకుంటారు అన్న మాట.
బీఆర్ ఎస్ ని 2022 అక్టోబర్ లో విజయదశమి వేళ పేరు మార్చారు. ఆనాటి నుంచి బీఅర్ఎస్ కి ఏ విధంగానూ కలసిరాలేదు అని గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఘోరంగా 2023 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు అయింది. దాంతో తెలంగాణా ఆత్మగా ఏర్పాటు అయిన పార్టీ ఇపుడు అదే తెలంగాణా కోసం తపిస్తోంది అంటున్నారు. పేరు మార్చుకోవడం ద్వారా సెంటిమెంట్ ని మళ్లీ రగిల్చి అధికారంలోకి రావచ్చు అన్న లెక్కలు వేసుకుంటున్నారు.
అదే విధంగా వస్తు దోషాలు ఉన్నాయి కాబట్టే పార్టీ ఓటమి పాలు అయింది అని మరో విషయం కూడా చెబుతున్న వారు ఉన్నారు. తెలంగాణా భవనంలో వాస్తు దోషం కారణంగా పార్టీ ఓటమి పాలు అయింది అని అంటున్నారుట. దాంతో పాటు తెలంగాణ భవన్ ని ఆగ్నేయం నుంచి నడపడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చాయని వాస్తు పండిట్స్ సూచిస్తున్నారుట.
ఇపుడు అర్జంటుగా తెలంగాణా భవన్ లో మార్పుచేర్పులు చేస్తున్నారు అని అంటున్నాజు. ఇలా చూస్తే కనుక మరి పేరుతో జాతకం మారుతుందా అంటే అది నమ్మని వారు కూడా ఉన్నారు. ఈ విషయాలను పట్టించుకుంటే పట్టించుకోవచ్చు కానీ దానితో పాటుగా పార్టీ ఎందుకు ఓడింది అన్నది నిజాయతీగా పరిశీలన చేసుకుని దానికి తగినట్లుగా పార్టీని మార్చుకుంటే జనంలో ఆదరణ లభిస్తుంది అని అంటున్నారు.
అంతే తప్ప సెంటిమెంట్లను పట్టుకుని కేవలం వాటి వల్లనే ఓటమి పాలు అయ్యామని భావిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరి గులాబీ అధినేతలకు ఈ విషయాలు అర్ధం అవుతాయా అన్నదే అసలైన చర్చగా ఉంది.