సీఎం రమేష్ మీద బూడిని రెడీ చేసిన వైసీపీ...!

అనకాపల్లి పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది

Update: 2024-03-26 11:28 GMT

అనకాపల్లి పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. ఈ పేరు చాలా కాలంగా వినిపిస్తున్నా హై కమాండ్ సరైన టైం లో ప్రకటించింది అని అంటున్నారు. ఎంపీ గా కూటమి నుంచి బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయింది.

దాంతో అందరి చూపూ వైసీపీ మీద పడింది. సీఎం రమేష్ బిగ్ షాట్ గా ఉన్నారు. అంగబలం అర్ధబలంతో ఆయన ధీటైన అభ్యర్ధిగా కూటమి భావిస్తోంది. అందుకే స్థానికుడు కాకపోయినప్పటికీ రమేష్ ని తెచ్చి పోటీకి నిలబెట్టారు. బీజేపీ నుంచి స్థానికంగా ఎంతో మంది ఆశావహులు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఏకంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడి కోసం టికెట్ ని ఆశించారు.

అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త ఈ సీటుని కోరుకున్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా పోటీకి డిసైడ్ అయ్యారు. ఆయన పేరే మొదట వినిపించింది. కానీ సీఎం రమేష్ కోసం బీజేపీ టీడీపీ ఈ సీటుని వ్యూహాత్మకంగా తీసుకున్నాయని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే సీఎం రమేష్ కి విశాఖతో పరిచయాలు ఎంతవరకూ ఉన్నాయి అనకాపల్లి గురించి ఏ మేరకు తెలుసు అనే కంటే ఆయన అన్ని విధాలుగా పవర్ ఫుల్ అనే పొలిటికల్ స్ట్రాటజీతో కూటమి ఆయనని పోటీ చేయిస్తోంది అని అంటున్నారు. అనకాపల్లిలో వైసీపీకి అనుకూలత ఉంది.

అలాగే ఎంపీ సీటు విషయంలో మొగ్గు ఉంది. దాంతో ఎంపీ అభ్యర్ధిగా బలమైన నేతను దించితే అది అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అన్న అంచనాలతో కూటమి రమేష్ కి ఓటేసింది. రమేష్ అభ్యర్ధిత్వాన్ని ముందు నుంచి ఊహిస్తూ వస్తున్న వైసీపీ అధినాయకత్వం తమ ట్రంప్ కార్డు గా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని వదిలింది.

బూడి 2014, 2019లలో రెండు సార్లు మాడుగుల సీటుని వరసగా గెలిచారు. అంతకు ముందు దాకా టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ సీటుని ఆయన వైసీపీ పరం చేశారు. ఇక చూస్తే కనుక ఆయన వైసీపీకి జగన్ కి వీర విధేయుడు గా ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య వైసీపీ విపక్షంలో ఉంటే ఆయన పార్టీ గడప దాటకుండా వైసీపీ వైపే ఉంటూ వచ్చారు. అందుకే జగన్ ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేశారు.

ఇపుడు ఆయన లోక్ సభకు మొదటిసారి పోటీ చేస్తున్నారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడుకు జిల్లాలో పలుకుబడి బాగా ఉంది. ఆయన వివాదరహితుడిగా ఉన్నారు. అవినీతికి దూరంగా ఉంటారు. ప్రజలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఆయన అయితే గెలుచుకుని వస్తారని గట్టి నమ్మకంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే మాడుగులలో బూడి కుమార్తె కె కోటపాడు జెడ్పీటీసీ అయిన ఈర్లి అనూరాధకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

చాలా కాలంగా ఇదే మాట కూడా ప్రచారంలో ఉంది. ఈసారి తనను తప్పించి తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని బూడి కోరారు అని అంటున్నారు. అయితే ఇపుడు బూడికి ఎంపీ టికెట్ కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ద్వారా జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. 2021లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో అనూరాధ జెడ్పీటీసీగా గెలిచారు. ఎస్టీకి జెడ్పీ వెళ్ళింది. లేకపోతే ఆమె జెడ్పీ చైర్మన్ గా నెగ్గేవారు అని అంటారు

ఆమె జిల్లా మహిళా నాయకురాలిగా ఉన్నారు. తండ్రికి తగిన వారసురాలిగా ఆమె ఎదుగుతున్నారు. మరో వైపు చూస్తే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో వెలమలు, కాపులు, గవరలు ఎక్కువ. ఈ మూడు సామాజిక వర్గాల వారే ఎపుడూ గెలుస్తూ వస్తున్నారు. గడచిన నాలుగు ఎన్నికల్లో వరసగా చూస్తే కనుక 2004లో కాపు సామజిక వర్గానికి చెందిన పప్పల చలపతిరావు టీడీపీ నుంచి నెగ్గారు.

2009లో కాంగ్రెస్ నుంచి సబ్బం హరి విజయం సాధించారు. 2014లో కాపుల నుంచి టీడీపీ తరఫున అవంతి శ్రీనివాసరావు గెలిచారు. 2019లో వైసీపీ నుంచి గవర సామాజిక వర్గం నుంచి భీశెట్టి సత్యవతి గెలిచారు. ఈసారి కూటమి, వైసీపీల నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే పోటీలో ఉన్నారు. దాంతో పదిహేనేళ్ల తరువాత ఈ సామాజిక వర్గానికి ఎంపీ పదవి మరోసారి దక్కనుంది.

Tags:    

Similar News