రే*ప్ ఆరోపణలు యూపీలోని బేకరీ మీదకు బుల్డోజర్

అయ్యోధ్యలోని పన్నెండేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Update: 2024-08-04 05:46 GMT

సంచలన నేరారోపణలు వెల్లువెత్తిన వారి ఆస్తులపై బుల్డోజర్ ను ప్రయోగించే కల్చర్ కు తెర తీసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి.. తాజాగా అలాంటి చర్యకు మరోసారి తెర తీశారు. తాజా ఉదంతం ఇప్పుడా రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే.. సదరు బేకరీ యజమాని సమాజ్ వాదీ పార్టీ నేత కావటం రాజకీయ రచ్చకు తెర తీసింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

అయ్యోధ్యలోని పన్నెండేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే.. ఈ దారుణ ఘటన అయోధ్యలోని ఒక బేకరీలో చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం జరిగిన ఈ దారుణానికి బాధితురాలు ఇప్పుడు గర్భవతి కావటం.. బాధితులు బయటకు రావటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన ఈ ఉదంతాన్ని యోగి సర్కారు సీరియస్ గా తీసుకుంది. శుక్రవారం బాధిత కుటుంబాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి.. పరామర్శించారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనూ పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ బేకరీని ఆహార కల్తీ విభాగం తనిఖీలు చేపట్టింది. దాన్ని సీజ్ చేశారు. బేకరీ చట్టవిరుద్ధమన్న విషయాన్ని అధికారులు గుర్తించిన కారణంగానే సీజ్ చేసినట్లుగా చెప్పిన అధికారులు.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ బేకరీని బుల్డోజర్ తో కూల్చేశారు. నిందితుడికి చెందిన ఆస్తులపైనా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. దారుణం జరిగిన రెండు నెలల తర్వాత ఈ విషయం బయటకు రావటం.. ఈ కేసు దర్యాప్తులో ఆలస్యం చేసినందుకు ఇద్దరు యూపీ పోలీసులను సస్పెండ్ చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బేకరీ యజమాని మోయిద్ ఖాన్.. అందులో పని చేసే రాజు ఖాన్ ను అరెస్టు చేశారు. బాధితురాలి వాంగ్మూలంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి యోగి వరకు విషయం వెళ్లటంతో ఇష్యూ ను సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇక.. బేకరీ యజమాని సమాజ్ వాదీ పార్టీకి చెందిన వాడు కావటంతో ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. అయోధ్య ఎంపీకి బేకరీ యజమాని దగ్గరివాడిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో వెల్లడించారు.

పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతంలో బేకరీ యజమానిపై సమాజ్ వాదీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో స్పందించిన ఆ పార్టీ.. రాష్ట్ర ప్రభుత్వం నిందితులందరికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని.. దోషులను చట్టప్రకారం శిక్షించాలన్నారు. అయితే.. డీఎన్ఏ పరీక్షల్లో చేసిన ఆరోపణలు తప్పు అని రుజువైతే.. తప్పుడు ఆరోపణలు చేసిన అధికారులను విడిచిపెట్టకూడదని డిమాండ్ చేస్తున్నారు.

గ్యాంగ్ రేప్ బాధితురాలికి సాయం చేసేందుకు బదులుగా.. సమాజ్ వాదీ పార్టీ పరువు తీయటానికే యోగి సర్కారు కుట్ర చేస్తున్నట్లుగా మండిపడింది. బాధితురాలికి ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని సమాజ్ వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. అయోధ్య అత్యాచారం కేసులో బీజేపీ ప్రజబుత్వం తీసుకున్న చర్యలు సముచితమని బీఎస్పీ అధినేత్రి మాయామతి వ్యాఖ్యానించారు. నిందితులకు డీఎన్ఏ పరీక్షలు చేయాలన్న ఆ పార్టీ.. తాము అధికారంలో ఉన్నప్పుడు రేప్ నిందితుల్లో ఎంత మందికి డీఎన్ఏ పరీక్షలు చేసిందంటూ మాయావతి విరుచుకుపడుతున్నారు.

Tags:    

Similar News