అతగాడి 'కరవు' పగోడికి కూడా వద్దు

పెళ్లి కోసం ఈ పెళ్లి కాని ప్రసాద్ చేసిన ప్రయత్నం వెరైటీగా నిలవటమే కాదు.. ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.

Update: 2024-12-14 04:04 GMT

అనుకుంటాం కానీ పెళ్లి కాని ప్రసాదుల కష్టం పగోడికి కూడా రాకూడదు. వారి వేదన ఎంత చెప్పినా తక్కువే. అయితే.. ఇప్పటివరకు ఎంతో మంది పెళ్లి ప్రసాదుల గురించి తెలిసి ఉండొచ్చు కానీ.. ఇతగాడి గురించి తెలిసినా.. ఈ చిట్టి వీడియోను చూసిన తర్వాత అంత తేలిగ్గా మర్చిపోలేరు. అంతటి ప్రభావం ఈ వీడియో సొంతం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వీడియోప్రారంభం నుంచి మధ్య వరకు కూడా ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వారి హావభావాలకు.. చివర్లో అతగాడి వేదన.. ఆవేదనకు వారంతా రియాక్టు అయ్యే తీరు చూసినప్పుడు మీ పెదాల మీద అప్రయత్నంగా చిరునవ్వు వచ్చేస్తుంది. ఇంతకూ ఈ ‘కరవు’ వీడియోను సమ్ థింగ్ స్పెషల్ గా చెప్పక తప్పదు.

పెళ్లి కోసం ఈ పెళ్లి కాని ప్రసాద్ చేసిన ప్రయత్నం వెరైటీగా నిలవటమే కాదు.. ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఎంతలా ప్రయత్నించినా పెళ్లి కాకపోవటంతో.. చివరకు తన పెళ్లి కోసం సదరు వ్యక్తి చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. యూఎస్ కు చెందిన వ్యక్తి తన భాగస్వామి కోసం చేసిన వెరైటీ ప్రయత్నాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎక్స్ లో పోస్టు చేశారు. అయితే.. ఈ వీడియోను ఎప్పుడు.. ఎక్కడ షూట్ చేశారు? అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే.. యూఎస్ లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

కదులుతున్న రైల్లో చిత్రీకరించిన ఈ వీడియోలో ఏముందన్నది చూస్తే.. ‘‘మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు సారీ. నేను డ్రగ్స్ వాడను. నాకు పిల్లలు లేరు. నేను మిమ్మల్ని డబ్బులు అడగటం లేదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమెరికాను ప్రేమిస్తాను. ప్లీజ్.. నన్ను పెళ్లి చేసుకోండి. దీంతో నేను అమెరికాలో ఉంటాను. నాకు బాగా వంట చేయటంవచ్చు. చక్కగా మసాజ్ చేస్తా. డిస్కో.. మ్యూజిక్ వింటాను. నాకు మీ డబ్బు అవసరం లేదు. నా డబ్బులే మీకు ఇస్తాను. దాంతో మంచి బట్టలు.. షూస్ కొనుక్కోవచ్చు’’ అంటూ సాగే అతగాడి మాటలకు మొదట్లో విసుగ్గా.. ఇబ్బందిగా ఫీలైన వారంతా అతను మాటలు సాగే కొద్దీ.. చుట్టూ ఉన్న అందరి ముఖాల్లోనూ నవ్వు రావటం కనిపిస్తుంది.

తనను ఎవరైనా పెళ్లాడతారా? అని అడిగినప్పుడు ఎవరూ స్పందించకపోవటంతో.. చివరకు అతను.. తనకు ఆడా.. మగ అన్న భేదం ఏమీ లేదని.. ఎవరినైనా పెళ్లి చేసుకోవటానికి తనకు అభ్యంతరం లేదని చెప్పటంతో.. ఈ పెళ్లి కాని ప్రసాద్ కరవు అందరి ముఖాల్లో నవ్వులు పూయించింది. ఈ వీడియోవైరల్ గా మారటమే.. అతడిపై పాజిటివ్ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఇంతకూ ఈ పెళ్లి కాని ప్రసాద్ కరవు వీడియోలో వ్యక్తి ఇప్పుడేం చేస్తున్నాడన్న కూతుహలం కలగటం ఖాయం.

Tags:    

Similar News