జగన్ కు కర్నూలు ఎంపీ దొరికేశారు... గుమ్మునూరు పరిస్థితి?
అవును... పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటూ పలువురు ఇన్ ఛార్జ్ లను మారుస్తూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సామాజిక సమీకరణలు, సర్వేల ఫలితాలు, నేతల పనితీరు మొదలైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటూ పలు చోట్ల ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యలో జగన్ నిర్ణయాలు నచ్చక బయటకు వెళ్లేవారు వెళ్తుంటే... ఆ ప్లేస్ లను సరికొత్త ఆప్షన్స్ తో ఫిల్ చేస్తున్నారు జగన్. ఈ సమయంలో బుట్టా రేణుకను రంగంలోకి దింపారు!
అవును... పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటూ పలువురు ఇన్ ఛార్జ్ లను మారుస్తూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నాలుగు జాబితాల్లో సుమారు 50 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమయంలో కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. టిక్కెట్ దక్కదనే సమాచారంతోనే ఈ నిర్ణయానికొచ్చినట్లు చెబుతున్నారు.
దీంతో కర్నూలు లోక్ సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారా అనే చర్చ జరుగుతున్న సమయంలో... మంత్రి గుమ్మనూరు జయరాం పేరు తెరపైకి వచ్చింది. ఈ సమయంలో... ప్రస్తుతం ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కర్నూల్ ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించారు. దీంతో ఈ నిర్ణయం నచ్చని జయరాం.. అజ్ఞాతంలోకి వెళ్లారనే కథనాలు మీడియాలో హల్ చల్ చేశాయి.
ఇదే సమయంలో... తన కుమారుడికి ఆలూరు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే తాను కర్నూల్ ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి రెడీ అని చెప్పారంటూ ప్రచారం కూడా నడిచింది. ఈ గ్యాప్ లో ఆలూరు నియోజకవర్గ టికెట్ ను జెడ్పీటీసీ విరూపాక్షకు కేటాయించారు. ఇక కర్నూలు లోక్ సభ స్థానం మాత్రమే ఖాళీగా ఉంది.. పోటీ చేయాలనే సంకేతాలు ఇచ్చారని తెలుస్తుంది. అయినప్పటికీ జయరాం నుంచి రెస్పాన్స్ రాలేదని ఒక వైపు.. కాంగ్రెస్ వైపు ఆయన చూపు అని మరోవైపు ఊహాగాణాలు తెరపైకి వచ్చాయి!
దీంతో అప్రమత్తం అయిన వైసీపీ అధిష్టానం కర్నూల్ ఎంపీ స్థానానికి బలమైన నేత కోసం వెతుకులాట మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఈ సమయంలో గతంలో కర్నూల్ ఎంపీగా పని చేసిన బుట్టా రేణుక పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం కూడా ఆమెకు ఉండటంతో.. బుట్టా రేణుక వైపే జగన్ మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే తరువాయని అంటున్నారు!
కాగా... 2014 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసిన బుట్టా రేణుక విజయం సాధించారు. అయితే అనంతర పరిణామాలతో ఆమె టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికలల్లో టీడీపీలోనూ టికెట్ దక్కకపోవడంతో ఆమె తిరిగి వైసీపీ గూటికి చేరారు. అయితే... అప్పటికే జగన్ అభ్యర్థులను ప్రకటించడంతో.. బుట్టా రేణుకకు టికెట్ దక్కలేదు. అయినప్పటికీ ఆమె వైసీపీలోనే కొనసాగుతున్నారు.
దీంతో... వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని.. ఇందులో భాగంగా ఆమె ఎమ్మినిగూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని చర్చ నడిచింది. అయితే అనూహ్యంగా ఆమెకు కర్నూల్ ఎంపీ టిక్కెట్ ఇచ్చే దిశగా జగన్ ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. దీంతో... గుమ్మునూరు జయరాం పరిస్థితి ఏమిటనే చర్చ మరింత హీట్ ఎక్కింది!!