పవన్ కి నిజమైన సినీ శ్రేయోభిలాషి ఆయనేనా ?

నిడదవోలులో జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా బీవీఎస్ ఎన్ ప్రసాద్ రంగంలోకి దిగారు.

Update: 2024-04-15 23:30 GMT

జనసేన కోసం సినీ రంగం నుంచి ఒక భారీ నిర్మాత మద్దతుగా నిలిచారు. ఆయన ఆ మధ్యన జనసేనలో చేరారు. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఆయన ఈసారి జనసేన గెలవాలని చెప్పి ఆ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. నిడదవోలులో జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా బీవీఎస్ ఎన్ ప్రసాద్ రంగంలోకి దిగారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ ది ఉండ్రాజవరం సొంత ప్రాంతంగా ఉంది.

 

ఆయన పవన్ అంటే ఎంతో ఇష్టపడతారు. ఆయన రాజకీయాల్లో రాణించాలని గట్టిగా కోరుకుంటారు. నిజానికి సినీ రంగం నుంచి పవర్ స్టార్ కి చాలా మంది మద్దతు ఇస్తూ వచ్చారు. కానీ వారి మద్దతు ఎంత ఉంది గ్రౌండ్ లో వారి పాత్ర ఎంత అన్నది కూడా చూడాలి.

అయితే ఏడు పదుల వయసులో ఉన్న ప్రసాద్ మాత్రం అన్నీ మరచి జనసేన గెలుపు కోసం పడుతున్న కష్టం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని ఉత్తేజాన్ని కూడా కలుగచేస్తోంది. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా ఆయన నేను సైతం అంటూ అభ్యర్ధి కందుల దుర్గేష్ తో పాటుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం మాత్రం గొప్పదే అంటున్నారు.

ఈయనే కదా అసలైన జన సైనికుడు అని అంటున్నారు కూడా. రాజకీయాలలోకి ఆయన రావడం వెనక కూడా పవన్ ని ఉన్నతంగా చూడాలనే అని అంటున్నారు. చాలా మంది మాదిరిగా టికెట్ కోసమో మరో దాని కోసమో ఆయన పార్టీలో చేరలేదు అని అంటున్నారు. ఈ రోజులలో అంతా చూస్తున్నారు. టికెట్ రాకపోతే ఏకంగా జెండా పీకేసి పార్టీని వదిలేసి ఎంత రచ్చ చేయాలో అంత చేస్తున్నారు. అలాంటిది ఏమీ ఆశించకుండా జనసేన కోసం పవన్ కోసం ఈ బడా నిర్మాత ఒక సామాన్య కార్యకర్తలా పాటుపడుతున్న తీరు జనసేన వర్గాలకే కాదు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి కూడా స్పూర్తిదాయకమే అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే నిడదవోలులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూటమి ఉమ్మడి అభ్యర్ధి కందుల దుర్గేష్ కలసి ఇంటింటి ప్రచారం చేస్తూ వస్తున్నారు. జోరు పెంచారు. జనాలకు దగ్గర అవుతున్నారు. వారితో పాటుగా నేనూ అంటూ ప్రసాద్ నడుస్తున్నారు.

ఆయన మొక్కవోని పట్టుదల చూసిన వారు పవన్ కి ఇలాంటి వారు సినీ రంగం నుంచి శ్రేయోభిలాషులుగా ఉంటే ఇక ఎదురేముంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి ఈ తరహా సైనికులు కూడా ఉన్నారని అంటున్నారు. జనసేన ఐడియాలజీ ని వంటబట్టించుకుని తాముగా ముందుకు వచ్చే ఈ తరహా సైన్యం ఉంటే జనసేన జెండాకు ఎదురు ఉండదని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రసాద్ హేట్సాఫ్ అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News