మరోసారి మస్క్ కు ట్రంప్ ఎఫెక్ట్... కానీ రివర్స్ లో!!

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన వేళ.. మస్క్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Update: 2024-11-15 04:48 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్ద్ ట్రంప్ విజయంలో ఎలాన్ మస్క్ పాత్ర కూడా కీలకమైనదనే సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే ట్రంప్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఇక.. ట్రంప్ గెలుపు కన్ ఫాం అయినప్పటి నుంచీ మస్క్ సంపద భారీగా పెరగడం మొదలయ్యింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కన్ ఫాం అయిన సమయంలోనే మస్క్ సంపద భారీగా పెరిగిందని.. ఆయన సంపద మొత్తం 50 బిలియన్లు పెరిగి 314 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. ఈ ప్లస్ సంగతి కాసేపు పక్కనపెడితే... ట్రంప్ గెలుపు వేళ ఎక్స్ కి చాలామంది బై బై చెప్పారని అంటున్నారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన వేళ.. మస్క్ నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు మస్క్ దీన్ని వినియోగిస్తారని పలువురు పేర్కొంటున్నారని తెలుస్తోంది. దీతో పెద్ద ఎత్తున యూజర్లు ఎక్స్ కు బై చెప్పారని అంటున్నారు.

వాస్తవానికి మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎక్స్ లో చాలా మార్పులే జరిగాయి. గతంలో నిషేధించిన ఖాతాలను పునరుద్ధరించడం.. వెరిఫికేషన్ విధానాలను మార్చడం వంటి నిర్ణయాలు మస్క్ ను పెద్ద ఎత్తున విమర్శలపాలు చేశాయి! వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం డబ్బులు చెల్లించేలా తీసుకొచ్చిన మార్పులతోనూ ప్రకటనల వ్యాపారం దెబ్బతిందని చెబుతారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ గెలుపు అనంతరం పెద్ద ఎత్తున యూజర్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్ ను వీడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా... సుమారు 1,15,000 మంది అమెరికా యూజర్లు ఎలక్షన్ తర్వాత రోజు వెబ్ సైట్ లో తమ ఖాతాలను డీయక్టివేట్ చేశారని తెలుస్తోంది.

వీటితో పాటు.. సోషల్ మీడియా వేదిక చుట్టూ కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో ముగ్గురు ప్రముఖ పాత్రికేయులు ఈ వారంలోనే ఎక్స్ ను వీడారు. ఇందులో భాగంగా... చార్లీ వార్జెట్, న్యూయార్క్ టైంస్ మారా గే, మాజీ సీ.ఎన్.ఎన్. యాంకర్ డాన్ లెమన్ లు ఎక్స్ ను వీడి "బ్లూ స్కై"లో చేరారు.

ఇదే సమయంలో... బ్రిటన్ కు చెందిన మీడియా సంస్థ "ది గార్డియన్" కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఇకపై "ఎక్స్" వేదికగా ఎటువంటి పోస్టులు చేయబోమని ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ వేదికలో ఆందోళన కలిగించే అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

Tags:    

Similar News