కేబినెట్ విస్తరణకు మళ్లీ బ్రేక్.. ఇక వారంతా మంత్రులయ్యేదెన్నడు..?

ప్రమాణస్వీకారం సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌తోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Update: 2024-10-21 16:30 GMT

కేబినెట్ విస్తరణ జరుగుతుంది.. ఇక తామంతా మంత్రులం అవుతున్నాం అని కలలు కంటున్న వారికి ఎప్పటికప్పుడు నిరాశలే ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు అవుతోంది. కానీ.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. ప్రమాణస్వీకారం సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌తోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి మిగితా మంత్రివర్గాన్ని కూడా త్వరలోనే భర్తీ చేస్తామంటూ ఎప్పటికప్పుడు లీకులు ఇస్తున్నారు. ఇంకా మంత్రివర్గంలో ఆరుగురికి స్థానం ఉంది. దాంతో ఆశావహుల జాబితా కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గత ఆరు నెలలుగా మంత్రివర్గ విస్తరణపై లీకులు వస్తూనే ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ఇక మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. ఆయన అలా ఇప్పటికి 25సార్లు వెళ్లివచ్చారు. కానీ..ఇంతవరకూ మంత్రివర్గ విస్తరణ అంశం తేలలేదు.

ప్రభుత్వం కొలువుదీరాక సంక్రాంతి ముహూర్తం అన్నారు.. ఆ తరువాత ఉగాది అన్నారు.. ఆ తరువాత ఏకాదశి అన్నారు.. వినాయకచవితి అన్నారు.. దసరా అన్నారు.. పండుగలన్నీ కూడా అయిపోయాయి. కానీ.. ఇంతవరకు కొలిక్కిరాలేదు. అయితే.. ఇటీవల నిర్వహించిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. కొత్త ప్రభుత్వాలు సైతం కొలువుదీరాయి. ఈ క్రమంలో మళ్లీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ కోసమే ఆయన ఢిల్లీకి వెళ్లినప్పటికీ వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.

ఇక ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. దాంతో ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ.. తాజాగా అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలు విని అందరూ షాక్‌కు గురయ్యారు. ఇప్పటికే హర్యానా ఎన్నికల్లో దెబ్బ తిన్న కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ బీజేపీకి అవకాశం ఇవ్వొద్దని కఠిన దీక్షతో ముందుకు సాగుతోంది. దాంతో అధిష్టానంలోని పెద్దలంతా మహారాష్ట్ర ఎన్నికలపైనే ప్రధాన దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ వద్దంటూ అధిష్టానం నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఇండికేషన్లు వచ్చాయి. దాంతో మరోమారి మంత్రివర్గ విస్తరణ వాయిదాపడింది. అయితే..ఇక్కడ కూడా కాంగ్రెస్ పలు ఈక్వేషన్లను పరిగణలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణకు పక్కనే ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేపడితే ఆశావహుల్లో చాలా మందికి అవకాశాలు దక్కకపోవచ్చు. దాంతో వారు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అసంతృప్తి కాస్త బీజేపీకి అస్త్రంగా మారొచ్చన్న ఉద్దేశంతో వాయిదా వేసినట్లుగానూ తెలుస్తోంది. ముందుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో జరిగిన అన్యాయంపై కాంగ్రెస్‌ను కార్నర్ చేసే అవకాశాలు ఉన్నాయని.. అందుకే ఇప్పుడు వద్దని రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు సమాచారం. దీంతో ఆశావహులంతా తమకు మంత్రి పదవి యోగం దక్కేది ఎప్పుడు అని నిరాశ నిస్పృహల్లో ఉండిపోయారు.

Tags:    

Similar News