తెరపైకి కేబినెట్ విస్తరణ.. కాబోయే మంత్రులు వీరేనా..?

ఈ నెలాఖరులోపే విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు సైతం చెబుతున్నాయి.

Update: 2024-10-15 13:30 GMT

తెలంగాణ రాష్ట్రం కేబినెట్ విస్తరణపై ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురించాయి. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండడంతో వారి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. అందులోనూ నిన్న పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో కేబినెట్ విస్తరణ ఇక ఎంతో దూరంలో లేదన్నది స్పష్టమైంది. ఈ నెలాఖరులోపే విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా ఆ పార్టీ వర్గాలు సైతం చెబుతున్నాయి.

గత డిసెంబరులో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో నలుగురికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కసరత్తు కూడా పూర్తిచేసినట్లుగా తెలుస్తోంది. ఆ నలుగురి పేర్లు కూడా ఇప్పటికే ఫైనల్ అయినట్లుగానూ సమాచారం.

అయితే.. మొన్నటివరకు జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు అంతా ఎన్నికల బిజీలో ఉండిపోయారు. దాంతో వారు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణను పెద్దగా పట్టించుకోలేదు. మధ్యలో సీఎం, డిప్యూటీ సీఎం చాలా సార్లు హస్తినకు వెళ్లినప్పటికీ కేబినెట్ విస్తరణ కొలిక్కి రాలేదు. అయితే.. ఇప్పుడు ఎట్టకేలకు ఎన్నికలు ముగిసి రిజల్ట్ కూడా వచ్చేయడంతో మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అయ్యారని వినిపిస్తోంది.

ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆహ్వానం అందింది. వీరితోపాటే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ కూడా సీడబ్ల్యూసీ మెంబర్లుగా ఉన్నారు. అయితే.. వారు కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. పనిలోపనిగా ఆ మరుసటి రోజే అధిష్టానం పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు సమాయత్తం అవుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెలాఖరులోపు విస్తరణ అంశం పూర్తిచేయాలని లక్ష్యంతో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో ఈ అంశంపై హైకమాండ్ చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే జాప్యం జరుగుతూ వస్తోంది. అందుకే.. ఈసారి ఎలా అయినా ఫైనల్ చేసుకొని రావాలనే ముఖ్యమంత్రి రేవంత్ పట్టుదలతో ఉన్నారని సమాచారం. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈనెల 17న సాయంత్రం లేదా, 18న ఉదయం ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే.. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అలాగే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. దాంతో ఆయనకు కూడా బెర్త్ పక్కా అని స్పష్టం అవుతోంది. మరోవైపు.. వాకిటి శ్రీహరి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News