ఒక్కొక్కరిపై అప్పు రెట్టింపు చేసిన జగన్!... 'కాగ్' షాకింగ్ డిటైల్స్!
ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తలసరి అప్పు వివరాలు వెల్లడించింది.
"నాకు ఒక్క రూపాయి కూడా అప్పులేదు గురూ.. అన్నీ తీరిపోయాయి" అని ఎవరైనా అంటే.. ఈ విషయం వారికి ఒకసారి చెప్పొచ్చు! ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ప్రతీ వ్యక్తిపైనా లక్ష రూపాయల పైన అప్పు ఉందనే షాకింగ్ గణాంకాలు తెరపైకి వచ్చాయి. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తలసరి అప్పు వివరాలు వెల్లడించింది.
అవును... రాష్ట్రంలో మొన్నటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ, నిన్నటి వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ అప్పుల లెక్కల వివరాలను కాగ్ వెల్లడించింది. ఇందులో భాగంగా... రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై అప్పు 2018-19లో రూ.50,157గా ఉంటే.. 2019-20లో (బడ్జెట్ లో చూపని రుణాలు కలిపితే) రూ.73,525గా ఉందని తెలిపింది.
ఇక 2022-23 విషయానికొస్తే ఆ తలసరి అప్పు లక్ష దాటిపోయిందని తెలిపింది. ఇందులో భాగంగా... అప్పు ఒక్కో తలపైనా రూ.1,03,758గా పేర్కొంది. అంటే అప్పటి ఐదేళ్లలో 50 వేలు ఉంటే.. గత ఐదేళ్లలో 53వేలు అదనంగా తోడయ్యిందని అంటున్నారు! ఇక 2022-23లో తీసుకున్న అప్పుల్లో 68.51% పాత అప్పులు తీర్చడానికే సరిపోయిందని తెలిపింది.
ఈ సందర్భంగా... రాబోయే ఏడేళ్లలో రాష్ట్ర రూ.1,39,567.14 కోట్ల రుణాలను తీర్చాలని.. ఆ భారాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులను సమకూర్చుకోవడంతోపాటు.. రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాలని.. దీనికి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేకుండా పోతాయని వెల్లడించింది.