ఎలన్ మస్క్ కు గట్టి షాక్ ఇవ్వబోతున్న కెనడా

టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌పై కెనడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే దిశలో సూచనలు కనిపిస్తున్నాయి.

Update: 2025-02-26 11:37 GMT

టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌పై కెనడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే దిశలో సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో కెనడా ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని, ఇదే సమయంలో మస్క్ కూడా తమ దేశ సార్వభౌమత్వాన్ని తుడిచిపెట్టేలా ప్రవర్తించారన్న ఆరోపణలతో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- మస్క్‌పై పిటిషన్

కెనడా ప్రభుత్వం మస్క్‌పై చర్యలకు సిద్ధమవుతుందా? అన్నదానికి పిటిషన్‌కు ప్రజల నుంచి వస్తున్న మద్దతు సమాధానం చెప్పనుంది. ఇప్పటికే 2,82,037 మంది కెనడా పౌరులు ఈ పిటిషన్‌పై సంతకాలు చేశారు. జూన్ 20న ఈ పిటిషన్‌ను రచయిత క్యూలియా రీడ్, ఎన్డీపీ పార్లమెంట్ సభ్యుడు చార్లే ఆంగుస్ తయారు చేశారు. మస్క్‌ చర్యలు కెనడా జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయన విదేశీ ప్రభుత్వాలతో కలిసి కెనడా స్వతంత్రతను తగ్గించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

- మస్క్ స్పందన

ఈ ఆరోపణలపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. "కెనడా నిజమైన దేశం కాదు" అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్టు చేశారు, అయితే కొద్ది గంటల్లోనే దానిని తొలగించారు. దీనితో ఆయన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

- పౌరసత్వం రద్దు ప్రక్రియ

కెనడా చట్టాల ప్రకారం, ఒక వ్యక్తి మోసపూరితంగా పౌరసత్వం పొందినా లేదా ఇమిగ్రేషన్ శాఖకు తప్పుడు సమాచారం అందించినా, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం మస్క్‌కు దక్షిణాఫ్రికా పౌరసత్వం ఉంది. ఆయన 1989లో కుటుంబంతో కలిసి కెనడా వలస వచ్చారు, దీంతో కెనడా పౌరసత్వం పొందారు. 2002లో అమెరికా పౌరుడిగా మారారు.

- అమెరికా-కెనడా సంబంధాల ప్రభావం

ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా-కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ట్రంప్‌ పాలనలో కెనడాను 51వ రాష్ట్రంగా అభివర్ణించడం, అదనపు టారిఫ్‌లు విధించాలనే ప్రకటనలు ఈ దుస్థితికి దారితీశాయి. మస్క్‌పై దాఖలైన పిటిషన్ ఈ ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది.

ఈ పరిణామాలు ఎటు దారితిస్తాయో చూడాలి, కానీ మస్క్‌కు కెనడా పౌరసత్వం రద్దు చేసే అవకాశాలను కెనడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Tags:    

Similar News