దీంతోనైనా కెనడా ప్రధాని బుద్ధి మారుతుందా?
భారత్ పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదే పదే చేసిన అసత్య ఆరోపణలతో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి
తమ దేశంలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే చంపారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య వ్యవహారంలో భారత్ తమకు సహకరించాలని, భారత ప్రభుత్వం పాత్ర ఉందనేందుకు ఆధారాలు ఉన్నాయని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేకాకుండా తన మిత్ర దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాలకు సైతం భారత్ పై ఫిర్యాదులు చేశారు.
ఇది చాలదన్నట్టు కెనడా ఎన్నికల్లోనూ భారత ప్రభుత్వం జోక్యం చేసుకుందంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై భారత్ పాత్రను నిగ్గుతేల్చడానికి స్వతంత్ర కమిషన్ ను సైతం ఏర్పాటు చేశారు. దీంతో భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో కానీ, కెనడా ఎన్నికల్లో జోక్యం కానీ తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ట్రూడో ఆరోపణలను భారత్ గట్టిగా తోసిపుచ్చింది.
భారత్ పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదే పదే చేసిన అసత్య ఆరోపణలతో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెనడా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఆ దేశానికి వీసాల జారీని తాత్కాలికంగా నిలిపేసింది. అంతేకాకుండా భారత్ లో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని సగానికి పైగా తగ్గించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యానికి సంబంధించి కెనడా ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. భారత్ పై ఆరోపణలు నిరాధారమని కుండబద్దలు కొట్టింది. దీంతో కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం ఏమాత్రం లేదని తేటతెల్లమైంది.
కెనడాలో 2021 నాటి ఎన్నికలను ప్రభావితం చేసేలా భారత్ ప్రయత్నాలు చేసినట్లు తమ దృష్టికి రాలేదని ఆ ఎన్నికలను పర్యవేక్షించిన సీనియర్ అధికారి ఒకరు కమిషన్ కు సమాధానం ఇచ్చారు. భారత్ పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని వెల్లడించారు. మరోవైపు కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యానికి సంబంధించి స్వతంత్ర కమిషన్ ఎదుట జస్టిన్ ట్రూడో తాజాగా వాంగ్మూలం ఇవ్వనున్నారు.
మరోవైపు కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదని తేలగా చైనా జోక్యం ఉందని తేలింది. అయితే, ఆ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందంటూ మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబరులో స్వతంత్ర కమిషన్ దర్యాప్తు చేపట్టింది. కాగా.. ఆ ఎన్నికల్లో భారత్ జోక్యం లేదని వెల్లడైంది. మరోవైపు చైనా జోక్యం నిజమేనని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నివేదిక ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో భారత్ విషయంలో ఇప్పటికైనా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బుద్ధి మారుతుందో, లేదో వేచిచూడాల్సిందే.