ప్రత్యేక హోదా : నితీష్ నవీన్ లతో బాబు జగన్ పోటీ పడగలరా ?

మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుకు జగన్ కి బ్రహ్మాండమైన అవకాశం అయితే ఉభయ సభలలో ఉన్నాయి.

Update: 2024-07-19 03:26 GMT

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది అంటే లోక్ సభలో ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ జేడీయూ సహా అనేక ఇతర పార్టీల మద్దతు అవసరం అయింది. అయినా సరే సర్కార్ మనుగడ మీద ఇండియా కూటమి రోజూ విమర్శలు చేస్తూనే ఉంది. పూర్తి కాలం అధికారంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండడం డౌటే అని అంటోంది.

మరో వైపు చూస్తే రాజ్యసభలో అలాగే సీన్ ఉంది. 86 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇతర మిత్రులు అంతా కలసినా 101 మందే ఉన్నారు. దాంతో బిల్లులు పాస్ చేయించుకోవాలి అంటే 11 మంది వైసీపీ ఎంపీల మద్దతు ఉండాలి. అంతే కాదు ఒడిషాలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజీ జనతాదళ్ కి రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. వీరు కూడా మద్దతు ఇస్తే తప్ప బిల్లులు సజావుగా ఆమోదం పొందవు.

అయితే ఇటీవల నవీన్ పట్నాయక్ తన పార్టీ రాజ్యసభ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒడిశా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలదీయాలని కూడా కోరారు.

అంతే కాదు ఒడిషాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. దాంతో నవీన్ మద్దతు సంపాదించడం బీజేపీకి సవాల్ గానే ఉంటుందని అంటున్నారు. ఒకవేళ నవీన్ ని దగ్గరకు తీయాలని చూసినా ప్రత్యేక హోదా విషయం ఆయన ప్రస్తావిస్తారు. దాంతో ఆ డిమాండ్ కి తలొగ్గితేనే రాజ్యసభలో మద్దతు దక్కుతుంది.

మరి అదే రకమైన డిమాండ్ ముందు పెట్టి జగన్ ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలో మద్దతు ఇవ్వగలరా అన్నది ప్రశ్న. ఇపుడే కాదు గత అయిదేళ్లలోనూ రాజ్యసభలో బీజేపీకి అవుట్ రేట్ గా వైసీపీ మద్దతు ఇచ్చింది. లోక్ సభలో బలం ఉంది కదా అందుకే మేము ఏమీ అడగలేకపోయామని చెప్పిన వైసీపీ నేతలు రాజ్యసభలో ఎందుకు తమ డిమాండుని పెట్టలేకపోయారు అంటే జవాబు అయితే లేదు అంటున్నారు.

ఇపుడు కూడా మరోసారి అలాంటి సువర్ణావకాశం జగన్ కి రాబోతోంది అని అంటున్నారు. ఒకవేళ వైసీపీ ఎంపీలు అన్ కండిషనల్ గా రాజ్యసభలో మద్దతు ఇస్తే మాత్రం విమర్శల పాలు అవుతారు అని అంటున్నారు. అదే సమయంలో నవీన్ పట్నాయక్ మాత్రం ఈసారి బీజేపీకి తలొగ్గకుండా చుక్కలు చూపిస్తారు అనే అంటున్నారు.

ఇదే రకమైన పరిస్థితి లోక్ సభలోనూ ఎదురు కాబోతోంది అని అంటున్నారు. నితీష్ కుమార్ తన మద్దతు కీలకం అని భావించి అక్కడ ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టారు. అది రాను రానూ మరింత బిగ్ సౌండ్ చేసే అవకాశం ఉంది. ఆ టైం లో చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా మీద డిమాండ్ చేయాల్సిన అనివార్యత వస్తుంది.

మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుకు జగన్ కి బ్రహ్మాండమైన అవకాశం అయితే ఉభయ సభలలో ఉన్నాయి. మోడీ ప్రభుత్వం పూర్తిగా ఈ ఇద్దరి పార్టీల ఎంపీల మద్దతు మీద ఆధారపడిన నేపధ్యంలో ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు సాధించినట్లు అయితే అయిదు కోట్ల ఆంధ్రులకు ఎంతో లాభం కలుగుతుంది అని అంటున్నారు. అది జరగాలంటే రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఇద్దరూ ఎంతో కొంత కలవక తప్పదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News