రూ.40 లక్షల క్యాష్.. కారుతో డ్రైవర్ జంప్..కారణం తెలిస్తే అవాక్కే!
ఆశ అందరికి కామన్. కానీ.. ఆశ కాస్తా అత్యాశగా మారితేనే కష్టం. ఈ విషయంలో నియంత్రణ లేకుంటే మొదటికే మోసం వస్తుంది
ఆశ అందరికి కామన్. కానీ.. ఆశ కాస్తా అత్యాశగా మారితేనే కష్టం. ఈ విషయంలో నియంత్రణ లేకుంటే మొదటికే మోసం వస్తుంది. తాజా ఉదంతం గురించి తెలిస్తే ఇది మరింత బాగా అర్థమవుతుంది. ఈ మధ్యన యజమానికి చెందిన రూ.40 లక్షల క్యాష్.. కారుతో జంప్ అయిన డ్రైవర్ ను తాజాగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అతడ్ని విచారించగా విస్తుపోయే వాస్తవం బయటకు వచ్చింది. డ్రైవర్ అతితెలివి అతడ్ని జైలుపాలు చేసింది.
అసలేం జరిగిందంటే.. అత్తాపూర్ కు చెందిన విజయ్ కుమార్ ఫిబ్రవరి 24న రామంతపూర్ వెళుతున్నాడు. వాటర్ బాటిల్ కొనేందుకు కారులో నుంచి దిగి.. షాపుకు వెళ్లిన సమయంలో డ్రైవర్ కారుతో జంప్ అయ్యాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఆచూకీ కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతడ్ని రాజస్థాన్ లో పట్టుకున్నారు. అతడ్ని విచారించగా.. యజమాని కారులో రూ.40 లక్షల క్యాష్ పెట్టిన విషయాన్ని గుర్తించానని.. దాన్ని దొంగలించి రూ.11 లక్షలతో కారు కొని మిగిలిన మొత్తంతో బిజినెస్ పెట్టి సెటిల్ అవ్వాలని.. ఆపై పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేసినట్లుగా చెప్పటం గమనార్హం.
రాజస్థాన్ కు చెందిన విజేంద్ర సింగ్ ఏడాదిన్నర క్రితం అత్తాపూర్ కు చెందిన వ్యాపారి వినయ్ కుమార్ గుప్తా వద్ద కారు డ్రైవర్ గా చేరాడు. నమ్మకంగా ఉంటూ ఇంటి మనిషిలా మెలిగాడు. కొద్దిరోజుల క్రితం అత్తాపూర్ నుంచి రామంతాపూర్ కు కారులో బయలుదేరారు. దారి మధ్యలో దాహం వేయటంతో కారు దిగి వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చేసరికి కారు.. అందులోని నగదు బ్యాగ్ తో జంప్ అయిన వైనంతో షాక్ తిన్నాడు. అతడికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాప్ చేయటం.. ఎంతసేపటికి అతడి ఆచూకీ తెలియకపోవటంతో తనను మోసం చేసిన వైనా్ని గ్రహించాడు.
ఆ వెంటనే పోలీసుల్ని సంప్రదించి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత తన బ్యాగ్ లో రూ.3 లక్షల క్యాష్ ఉందని చెప్పిన వ్యాపారి.. తర్వాతి రోజున తాను సరిగా లెక్కలుచూసుకోలేదని.. బ్యాగులో రూ.40ల క్షల వరకు క్యాష్ ఉందని చెప్పటంతో పోలీసులు అలెర్టు అయ్యారు. ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని ప్రత్యేక టీంలను సిద్ధం చేశారు.చివరకు అతడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తొలుత దొంగలించిన డబ్బులన్ని ఖర్చు అయ్యాయని.. ఐపీఎల్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నట్లుగా బుకాయించాడు.
అతడి మాటల్ని నమ్మని పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో అసలు విషయాన్ని వెల్లడించాడు. తాను ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసుకున్నానని.. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు చెప్పాడు. చోరీచేసిన డబ్బులో రూ.11 లక్షలు పెట్టి కారు కొన్నానని.. మిగిలిన డబ్బులతో వ్యాపారం చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. దీంతో వినయ్ తో పాటు అతడు కొనుగోలు చేసిన కొత్త కారుతో పాటు రూ.20.,70 లక్షల డబ్బును.. రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.మిగిలిన డబ్బులతో అన్ని రోజులు విలాసవంతంగా జీవించినట్లు ఒప్పుకున్నాడు. అతడ్ని అరెస్టుచేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. దొంగతనం చేసిన డబ్బులతో పెళ్లి చేసుకోవటం వరకు ప్లాన్ బాగుంది కానీ.. పోలీసులకు చిక్కితే జన్మలో పెళ్లి కాదన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయినట్లు?